రోడ్డు నిర్మాణంలో ‘గిన్నిస్ రికార్డు’
● 7 రోజుల్లో 52 కి.మీ రోడ్డు నిర్మాణం
పుట్టపర్తి అర్బన్: బెంగళూరు–విజయవాడ జాతీయ రహదారి 544–జీ రోడ్డు నిర్మాణంలో రాజ్‌పత్ ఇన్‌ఫ్రా కాన్ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. జిల్లాలోని పుట్టపర్తి మండలం సాతార్లపల్లి నుంచి ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్ వరకూ 52 కిలోమీటర్ల తారు రోడ్డును కేవలం 7 రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో అనతికాలంలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన రాజ్‌పత్ ఇన్‌ఫ్రా కాన్ సంస్థ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి పుట్టపర్తి మండలం బొంతలపల్లికి విచ్చేసి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. రాజ్‌పత్ ఇన్‌ఫ్రా కాన్ సంస్థ రోడ్డు నిర్మాణంలో నాణ్యతతో పాటు ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. రహదారులు అభివృద్ధి చెందితే పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద న్నారు. అనంతరం మంత్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే సింధూరరెడ్డి, నేషనల్ హైవేఅధికారులు నిర్మాణ సంస్థ సీఎండీ జగదీష్ కదంకు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పంపిన ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొని రాజ్‌పత్ ఇన్‌ఫ్రా కాన్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.


