కంది రైతు కుదేలు
ధర్మవరం రూరల్: ప్రకృతి విపత్తులు, మరో పక్క చీడపీడలను అధిగమించి అంతంత మాత్రంగా సాధించిన కంది దిగుబడులకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో కంది పంట సాగుకు దుక్కి, సేద్యం మొదలు పంటను మార్కెట్‌కు తరలించే వరకూ రూ.15 వేలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది పంట కీలకమైన పూత దశలో ఉన్నప్పుడు అల్పపీడనాలతో కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ పూత రాలిపోయింది. ఇది కాస్త దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం చేతికి అందిన అరకొర పంటను రైతులు నూర్పిడి చేస్తున్నారు. ఎకరానికి ఒకట్రెండు బస్తాలకు మించి దిగుబడి లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉచిత పంటల బీమాతో ఆదుకున్న వైఎస్ జగన్
గత ఏడాది ప్రారంభంలో మద్ధతు ధర కన్నా ఎక్కువగా మార్కెట్ ధరలు ఉండడంతో కంది రైతులు ఒకింత లాభపడ్డారు. దీంతో ఈ ఖరీఫ్‌లో అత్యధికంగా కంది పంటను సాగు చేశారు. పంట కీలక దశలో ఉన్నప్పుడు వరుస తుపానుల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా రూ.5,500 నుంచి రూ. 6వేల వరకు ధర పలుకుతోంది. ఈ ధరతో పంటను విక్రయిస్తే పెట్టుబడులు సైతం చేతికి అందకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంది పంట క్వింటాకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా.. నిబంధనల కారణంగా పంటను విక్రయించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాతో వేరుశనగ, కంది రైతులను అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారని, అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని అన్నదాతులు విన్నవిస్తున్నారు. ఉచిత పంటల బీమా పథకం వర్తించకపోవడంతో రైతు వాటా ప్రీమియం చెల్లించామని, అయినా పరిహారం అందుతుందో.. లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో తగ్గిన దిగుబడి
ఇన్‌పుట్ సబ్సిడీ, బీమాతో ఆదుకోవాలంటున్న అన్నదాతలు


