సీడీపీఓపై విచారణకు డిమాండ్
పుట్టపర్తి టౌన్: హిందూపురం సీడీపీఓ వరలక్ష్మి అవినితిపై విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్వోను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మరో వైపు అంగన్‌వాడీ టీచర్ల నుంచి అక్రమ వసూళ్లకు తెరలేపి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హిందూపురం ప్రాజెక్ట్‌లో సీడీపీఓ వరలక్ష్మి అవినీతి తారాస్థాయికి చేరుకుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, ప్రాంతీయ కార్యదర్శి వినోద్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.
60 సేలం కోళ్ల అపహరణ
బత్తలపల్లి: స్థానిక వేల్పుమడుగు బైపాస్ రోడ్డు సమీపంలోని నాటుకోళ్ల ఫారం నుంచి సోమవారం తెల్లవారుజామున సినీఫక్కీలో 60 సేలం కోళ్లను దుండగులు అపహరించారు. బాధితుడు, బత్తలపల్లికి చెందిన రాజేష్ తెలిపిన మేరకు... వేల్పుమడుగు రహదారిలోని బైపాస్ వద్ద నాటు కోళ్ల ఫారంను ఏర్పాటు చేసి అందులో నాటు కోళ్లతో పాటు సేలం కోళ పెంపకాన్ని చేపట్టాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు ‘అన్నా యాక్సిడెంట్ అయింది, తాగేందుకు నీళ్లు కావాలి’ అంటూ రాజేష్‌ను పిలిచారు. వారి మాటలు విశ్వసించేలా లేకపోవడంతో సమీపంలోని ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లాలని రాజేష్ తెలిపాడు. ఆ సమయంలో దుండగులు గేటు ఎక్కి లోపలికి దూకి రాజేష్ అప్రమత్తమయ్యేలోపు కట్టెతో దాడికి ప్రయత్నించారు. తప్పించుకోవడంతో రాళ్లు రువ్వడంతో రాజేష్ వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు రూ.2లక్షలు విలువ చేసే 60 సేలం కోళ్లను సంచుల్లో నింపుకుని బొలెరో వాహనంలో ఉడాయించారు. రాళ్ల దాడిలో గాయపడిన రాజేష్ ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
సీడీపీఓపై విచారణకు డిమాండ్


