రెవెన్యూ సేవల్లో పారదర్శకత ముఖ్యం
● సమీక్షలో జేసీ మౌర్య భరద్వాజ్
ప్రశాంతి నిలయం: ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో పారదర్శకత ముఖ్యమని జేసీ మౌర్య అన్నారు. సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు. పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారం, రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రీ సర్వే, జాయింట్ ఎల్‌పీఎంఎస్, పౌరసరఫరాల పంపిణీ, దీపం గ్యాస్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేర్చాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్‌లలో అందే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. రీ సర్వే పనులు నాణ్యతతో చేయాలన్నారు. గ్యాస్ పంపిణీ సజావుగా సాగేలా చూడాలన్నారు. సమీక్షలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, సర్వే శాఖ ఏడీ విజయశాంతి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.


