నికర జలాల సాధనే అంతిమ లక్ష్యం
కరువు పీడిత అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పాలకుల వైఖరిపై మేధావులు కన్నెర్ర చేశారు. రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. ఇందుకు రాయలసీమ జన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు పాల్గొని మద్దతు తెలిపారు.
అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య
హిందూపురం: స్థానిక కొట్నూరు సమీపంలోని రైల్వే బ్రిడ్జికి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెనుకొండలోని కళాశాలలో డిగ్రీ చదువుతున్న భరత్(25) ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఊటకూరులోని బంధువుల ఇంటికి వచ్చిన భరత్... శనివారం మధ్యాహ్నం రైల్వే బ్రిడ్జికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతపురం: రాయలసీమ జిల్లాల నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలంటే నికర జలాల సాధనే అంతిమ లక్ష్యంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడం ఒక్కటే మార్గమని మాజీ మంత్రి, రాయలసీమ జన సంఘం అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాయలసీమ జన సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వీరభద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాదా గాంధీ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్, రాయలసీమ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటేశులు, న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ఎస్‌యూసీఐ వ్యవస్థాపకుడు ఆంజనేయులు, వేమన, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. రాయలసీమలోని ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 40 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు, చైన్నె తాగునీటికి 15 టీఎంసీలు, గాలేరు–నగరికి 38 టీఎంసీలు, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీల చొప్పున నీరు అవసరమవుతోందన్నారు. ఈ ప్రాజెక్ట్‌లకు శ్రీ శైలం జలాశయంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప నీరు అందని పరిస్థితి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదని గుర్తించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయంలో 800 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే ఫోర్‌షోర్ నుంచే రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తి పోసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ ఒత్తిళ్లకు సీఎం చంద్రబాబు తలొగ్గి ఎత్తిపోతల పథకం పనులు ఆపేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు– రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల కృష్ణా నీటిని తరలించుకెళుతోందని, అలాగే కల్వకుర్తిలో 25 టీఎంసీలకు గాను 50 టీఎంసీల నీటిని అక్కడి పాలకులు తోడేస్తున్నారని, కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు చేపట్టడంతో ఇంతకు మునుపు ఉన్న 60 వరద రోజులు ప్రస్తుతం 30కి పడిపోయాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలంటే నికర జలాల సాధన ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఇందుకు పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమాన్ని చేపడదామని పిలుపునిచ్చారు.
అభివృద్ధి అక్కడ... ఆర్థిక భారం ఇక్కడ
చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు అనాదిగా రాయలసీమ ప్రాంతం బలవుతూ వస్తోందని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, హైకోర్టును అమరావతికి తరలించుకెళ్లారన్నారు. అమరావతిలో ఎకరం భూమి అభివృద్ధికి రూ. 2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. భూ సమీకరణ ఇతర ఖర్చులు కలుపుకుని మొత్తం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. వీటికి సంబంధించి ఏటా రూ.16 వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ భారాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రస్తుతం రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసుల్లో వ్యక్తమవుతోందన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్ మాట్లాడుతూ.. రాయలసీమకు నీళ్లు రావడం కోసం చేపట్టే రాయలసీమ ఉద్యమానికి రచయితలు, కళాకారులు వెన్నంటే ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత దాదా గాంధీ మాట్లాడుతూ.. రాయలసీమ పరిరక్షణకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రహస్య ఒప్పందాలతో తమకు పనిలేదని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపిస్తామని అన్నారు.
రాయలసీమ జన సంఘం అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపు
ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి
శాశ్వతంగా కరువును తరిమేయాలి
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు యథాతథంగా కొనసాగాలి
సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు
రాయలసీమ విస్తీర్ణం ప్రకారం 666 టీఎంసీల నికర జలాలు రావాలి. కానీ, ప్రస్తుతం కేవలం 140 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి 80 టీఎంసీలు అదనంగా ఇవ్వాలి.
హంద్రీ–నీవా సుజల స్రవంతి, జీఎన్‌ఎస్‌ఎస్, వెలిగొండ ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించాలి. వాటికి నికర జలాలు కేటాయించాలి.
పంట కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించాలి.
పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ప్రజా చైతన్యం తీసుకురావాలి. రాయలసీమ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపాలి.


