ప్రయాణం.. ప్రాణ సంకటం
బత్తలపల్లి: రహదారుల నిర్వహణపై ఎన్‌హెచ్ అధికారులు చూపుతున్న అంతులేని అలసత్వం సామాన్యుల ప్రాణాల మీదికొస్తోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రహదారిపైకి వచ్చాక గమ్యం చేరే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందంటే అతిశయోక్తి కాదు.
అధ్వానంగా జాతీయ రహదారి..
బత్తలపల్లి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారి అధ్వానంగా మారింది. రహదారికి ఇరువైపులే కాకుండా డివైడర్ వద్ద కూడా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ రహదారి గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బత్తలపల్లి నుంచి అనంతపురం నగరానికి వివిధ పనుల నిమిత్తం మండలంలోని పలు గ్రామాల వారు ద్విచక్రవాహనాల్లో వెళ్తుంటారు. ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కానరాకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకునేందుకు ద్విచక్రవాహన చోదకులు పక్కకు వెళ్తే ముళ్ల చెట్లు గీసుకుపోతుండడంతో అవస్థలు చెప్పనలవిగా మారాయి. రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలతో పాదచారులకు కూడా ఇబ్బందికరంగా ఉంటోంది. ప్రతి సంవత్సరం రోడ్డు మార్జిన్లలో జంగిల్ క్లియరెన్స్ పేరుతో తుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించేవారని, ఈ ఏడాది అడవిలా పెరిగిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత నేషనల్ హైవే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధ్వానంగా జాతీయ రహదారి
ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు
డివైడర్ మధ్యలోనూ ముళ్ల చెట్లు
సామాన్యులకు శాపంగా ఎన్‌హెచ్ అధికారుల అలసత్వం
ప్రయాణం.. ప్రాణ సంకటం


