గాలిపటం ఎగురవేస్తూ...
రాయదుర్గం టౌన్: గాలిపటం ఎగురవేస్తూ అదుపు తప్పి మిద్దైపె నుంచి ఓ బాలుడు కిందపడ్డాడు. రాయదుర్గంలోని కోట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాఘవేంద్ర స్వామి గుడి వద్ద నివాసముంటున్న పాలయ్య కుమారుడు ఉపేంద్ర.. జిల్లా సరిహద్దులోని కర్నాటకలో ఉన్న మొలకాల్మూరులో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం 11 గంటల సమయంలో గాలిపటం ఎగురవేసేందుకు ఇంటిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేస్తూ మిద్దె చివరి ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్‌లో బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. కాగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి శెట్టిపి
ధర్మవరం అర్బన్: యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రారెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరులో జరిగిన 51వ యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఎంపిక లాంఛనంగా జరిగింది. ఆయన ఎంపికపై యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్‌నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వరకుమారి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ, పట్టణ నాయకులు జింకా హరికృష్ణ, రామాంజనేయులు, ఆంజనేయులు, వెంకట కిషోర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఇంటిపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
బత్తలపల్లి: యువకుడి ఇంటిపై చోటు చేసుకున్న దాడికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బత్తలపల్లి పీఎస్ ఎస్‌ఐన సోమశేఖర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 15న రాత్రి దంపెట్ల గ్రామంలో ఓ యువతిని అపహరించుకుని వెళ్లాడంటూ యువతి తండ్రి, కుటుంబసభ్యులు సదరు యువకుడి ఇంటిపై దాడి చేశారు. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులు మల్లెల ఆదినారాయణ, మల్లెల హరిదాసు, మల్లెల మోహన్, మైత్రి, అనితను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
చెన్నేకొత్తపల్లి: జీవితంపై విరక్తితో మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. సీకే పల్లి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి సుబ్బరాయుడు(75) పదేళ్లుగా గ్యాంగ్రీన్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆయన మృతిచెందాడు.
గాలిపటం ఎగురవేస్తూ...


