పోక్సో కేసులో ‘అనంత’ వాసికి రిమాండ్
బత్తలపల్లి: మండలంలోని ఓ గ్రామంలో గత ఏడాది నవంబర్ 15న ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ప్రేమ పేరుతో మోసగించిన బాలికను యువకుడితో పాటు యువకుడి తండ్రి, ఆశ్రయం ఇచ్చిన మరో నిందితునిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే యువకుడితో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపామన్నారు. ఆశ్రయం ఇచ్చిన అనంతపురంలోని కేకేపల్లి కాలనీకి చెందిన ఈడిగ ప్రదీప్‌కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
వ్యక్తి బలవన్మరణం
బత్తలపల్లి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లిలో నివాసముంటున్న కూరే ముత్యాలు(49) భార్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక రెండు నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో మనోవేదనకు లోనైన ముత్యాలు ఆదివారం తన పొలం వద్ద కానుగ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు సంజీవరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రెండిళ్లలో చోరీ
చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో శనివారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగింది. గ్రామ సర్పంచ్‌ఽ ధనుశ్రీ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చూసేందుకు ఇంటికి తాళం వేసి కొత్తచెరువుకు వెళ్లారు. గుర్తించిన దుండగులు శనివారం రాత్రి తాళాన్ని బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, 6 తులాల బంగారు, 45 తులాల వెండి సామగ్రి అపహరించారు. అనంతరం వెంకటాంపల్లి రోడ్డు లో నివాసముంటున్న మోహన్ ఇంటికి సైతం తాళం వేసిన విషయాన్ని గుర్తించి బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి రూ.5,800 నగదు అపహరించారు. మోహన్ తన ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న మరో ఇంట్లో నిద్రించిన సమయంలో అతని ఇంట్లో చోరీ జరిగింది. ఆదివారం ఉదయం చోరీలను గుర్తించిన బాధితుల సమాచారంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి వేలిముద్రలను సేకరించారు.
యువతి ఆత్మహత్య
ఎన్‌పీకుంట: మండలంలోని మండెంవారిపల్లికి చెందిన ఉషారాణి (20) ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి తాళలేక శనివారం రాత్రి విషపూరిత ద్రావకం తాగడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి శేఖరనాయుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ పి.కృష్ణమూర్తి తెలిపారు.


