రేనాటి యోధుడు వడ్డే ఓబన్న
అనంతపురం ఎడ్యుకేషన్: బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. వడ్డే ఓబన్న జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు ఆదివారం అనంతపురంలోని లలిత కళా పరిషత్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత మాట్లాడుతూ విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరతారన్నారు. తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే బ్రిటీషర్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడన్నారు. ఆయన త్యాగాలు, కృషిని గుర్తించి జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వడ్డెర్లు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వేడుకలు జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ వడ్లెర్ల యుగ పురుషుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ ఓబన్నను స్ఫూర్తిగా తీసుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ రామ్మోహన్, అహుడా సెక్రటరీ రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన్ ఈడీరామసుబ్బారెడ్డి, వడ్డెర ప్రముఖులు దేవళ్ల మురళి, వడ్డే అంజనప్ప, మల్లెల జయరాం, వడ్డెర సంఘ ప్రతినిధులు, బీసీ కులాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి


