ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
పుట్టపర్తి అర్బన్: మండలంలోని పెడపల్లి వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పైపల్లి గ్రామం నుంచి పెడపల్లికి ఆదివారం టీవీఎస్ వాహనంపై వెళుతున్న వృద్ధుడు లక్ష్మయ్యను పుట్టపర్తి నుంచి కియా కంపెనీలో విధులకు వెళుతున్న పుట్టపర్తికి చెందిన యువకులు పల్సర్ బైకుతో ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులు హరి, కృష్ణ, అజయ్‌కుమార్‌ను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించింది. వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఆటోలో అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుల్లో ఇద్దరికి తలకు, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మయ్యకు కాళ్లు, తలకు గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనపై పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ క్రాంతి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదాలపై గ్రామస్తుల ధర్నా
342వ జాతీయ రహదారి నిర్మాణంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక యువకులు గంట పాటు పెడపల్లి వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డుగా మొద్దులు, రాళ్లు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కొన్ని రోజుల్లోనే ఐదు ప్రమాదాలు చోట చేసుకుని పలువురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పెడపల్లి నుంచి పెనుకొండ వరకూ సుమారు 20 గ్రామాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు.


