నకిలీ పోలీస్ అరెస్ట్
తనకల్లు: పోలీసునంటూ రైలు ప్రయాణికులను బెదిరించి డబ్బులను వసూలు చేస్తున్న వ్యక్తిని తనకల్లు రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.కదిరి రైల్వే పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం...తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడేవాండ్లపల్లికి చెందిన ఈరిశెట్టి శివశంకర్ పీలేరులో నివాసం ఉంటున్నాడు. గతంలో అతను చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో హోంగార్డుగా పనిచేసేవాడు. అయితే మద్యపానం, ఇతర ఆరోపణలతో ఉన్నతాధికారులు సర్వీసు నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోయిన శివశంకర్... నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడు. పోలీస్ యూనిఫాం ధరించి పాకాల– చిత్తూరు మధ్య తిరిగే ప్యాసింజర్ ట్రైన్‌లలో ప్రయాణిస్తూ టికెట్ లేని ప్రయాణికులను బెదిరించి డబ్బులను వసూలు చేసేవాడు. రెండు వారాల క్రితం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పాకాల సమీపంలో ప్రయాణికుల నుంచి రూ. 25 వేలు వసూలు చేశాడు. ఈ నెల 8వ తేదీన పీలేరు రైల్వేస్టేషన్‌లో శివశంకర్ పోలీస్ డ్రస్సులోనూ మిగిలిన ఇద్దరు వ్యక్తులు సివిల్ డ్రస్సులో రైలు ఎక్కారు. కలికిరి– మదనపల్లి మధ్య ప్రయాణిస్తున్న కదిరికి చెందిన కంపా నారాయణస్వామి వద్దకు వెళ్లి తాను పోలీసునని చెప్పి... అతన్ని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చెంపపై కొట్టి షర్ట్ జేబులో ఉన్న రూ.1,500 బలవంతంగా లాక్కున్నాడు. అనంతరం నారాయణస్వామిని రైలు నుంచి కిందికి తోసి వేస్తానని బెదిరించి మరో రూ. 550 తీసుకున్నాడు. దీంతో బాధితుడు నకిలీ పోలీస్‌పై కదిరి ఆర్‌పీఎఫ్‌లో ఫిర్యాదు చేశాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఈడిశెట్టి శివశంకర్ తనకల్లు రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న రైల్వే ఎస్‌ఐ బాలకృష్ణ, ఏఎస్‌ఐ శివారెడ్డి నిందుతున్ని అరెస్టు చేసి నకిలీ నేమ్ ప్లేట్‌తో ఉన్న పోలీస్ యూనిఫాం, రూ.2,050 స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీసునంటూ రైలులో ప్రయాణికుల నుంచి డబ్బుల వసూలు
అరెస్టు చేసి రిమాండ్‌కు
పంపిన రైల్వే పోలీసులు


