యువకుడి అనుమానాస్పద మృతి
హిందూపురం: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హిందూపురంలో జరిగింది. శనివారం స్థానిక కొట్నూరు సమీపంలోని రైల్వే బ్రిడ్జికి అచేతన స్థితిలో యువకుడు వేలాడుతుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వయసు 25 ఏళ్లలోపు ఉండవచ్చని తెలిసింది. అతడి వద్ద ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేసి వేలాడదీశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరు వివాదాస్పదం..
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడంలో హిందూపురం పోలీసులు, రైల్వే పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తమ పరిధి కాదంటే తమది కాదంటూ రాత్రి 9 గంటలైనా శవాన్ని స్వాధీనం చేసుకోలేదు. చివరకు డీఎస్పీ మహేష్ ఆదేశాలతో హిందూపురం రూరల్, అప్‌గ్రేడ్ పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
హిందూపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని గోళాపురం వద్ద జరిగింది. గోళాపురం సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో పనిచేయడానికి వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు. ఇలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఫర్హాన్ (30), మరొక వ్యక్తితో కలిసి శనివారం సాయంత్రం బైకులో ఫ్యాక్టరీ వద్దకు వెళ్తుండగా గోళాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఫర్హన్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. గాయపడిన మరొక వ్యక్తిని బెంగ ళూరులోని ఆస్పత్రికి తరలించారు. హిందూపురం రూరల్ పోలీసులు మృతుడి కుటుంబీ కులను విచారిస్తున్నారు.
‘అమరాపురం’లో వ్యక్తి..
అమరాపురం: మండల పరిధి లోని కమ్మరహట్టి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్నడకు గ్రామానికి చెందిన సురేష్ (30) మృతి చెందాడు. వివరాలు.. పని నిమిత్తం శనివారం సాయంత్రం అమరాపురం వచ్చిన సురేష్ అనంతరం చిట్నడకుకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. కమ్మరహట్టి సమీపంలో బైకు అదుపు తప్పి కిందపడడంతో తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ వలీభాష, ఏఎస్‌ఐ రామంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.


