విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రొద్దం: ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటన మండల కేంద్రంలో జరిగింది. శనివారం ప్రయాణికులతో వస్తున్న బస్సు స్థానిక పావగడ–పెనుకొండ మార్గంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన స్తంభాన్ని ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం లక్ష్మీనారాయణ గుప్తా అనే వ్యక్తి ఇంటిపై ఒరిగింది. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం కింది భాగంలో పూర్తిగా తుప్పుపట్టిందని, స్తంభాన్ని మార్చాలని పలు మార్లు ట్రాన్స్‌కో ఏఈకి విన్నవించినా ఆయన స్పందించలేదని వాపోయారు. ప్రజల ప్రాణాలంటే ఆయనకు లెక్కలేకుండా పోయిందన్నారు. ప్రాణాలు పోతేగాని స్పందించారా అంటూ మండిపడ్డారు.
నీటి కుంటలో పడి బాలిక మృతి
నల్లమాడ: నీటి కుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన మేరకు... మండలంలోని కుటాలపల్లికి చెందిన రవిచంద్రారెడ్డి, ఉమాదేవి దంపతుల కుమార్తె సాయి సంకీర్తన (17) పదో తరగతి పూర్తి చేసింది. తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లడంతో నల్లసింగయ్యగారిపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. శనివారం ఉదయాన్నే బయటకు వెళ్లిన సాయి సంకీర్తన ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తాత వెంకట్రా మిరెడ్డి గ్రామంలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం గ్రామ సమీపంలోని సింగినేయ కుంటలో సాయి సంకీర్తన శవమై కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి తిరిగి వచ్చి కుమార్తె మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. కొన్ని రోజులుగా సాయి సంకీర్తన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు


