కూతురి కోసం వెళ్లి.. కానరాని లోకాలకు!
తిరుపతి రూరల్/చెన్నేకొత్తపల్లి: సంక్రాంతి పండుగకు కూతురుని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఓ తండ్రి ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన తిరుపతి శివార్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చెన్నేకొత్తపల్లి మండలంలోని నామాల గ్రామానికి చెందిన పగిడి వెంకటేశ్వరరెడ్డి (38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య వసుంధర, కుమార్తె లిఖిత, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వరరెడ్డి కుమార్తె లిఖిత తిరుపతి శివారులోని తణపల్లి వద్దనున్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు శుక్రవారం రాత్రి బస్సులో తిరుపతి వచ్చిన వెంకటేశ్వరరెడ్డి తణపల్లి జంక్షన్ వద్ద నడుచుకుంటూ జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న విజయానంద ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు 108 ద్వారా చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు బస్సు డ్రైవర్ వినోద్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తన తండ్రి కాలేజీ వద్దకు వస్తాడని ఎదురుచూసిన కుమార్తె ఆయన మరణవార్త తెలిసి తల్లడిల్లింది. బంధువులు దుఖఃసాగరంలో మునిగారు.
తిరుపతిలో బస్సు ఢీకొని
సీకేపల్లి మండలవాసి దుర్మరణం


