జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన కారు
పరిగి: మండలంలోని నేతులపల్లి సమీపంలో 544ఈ జాతీయ రహదారిపై ఓ కారు పల్టీ కొట్టి బ్రిడ్జి సైడ్ వాల్‌పైకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే... బెంగళూరులో ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన విజయ్, రమేష్ మడకశిర వైపు నుండి కొడికొండ వైపుగా కారులో ప్రయాణిస్తూ శుక్రవారం వేకువజామున నేతులపల్లి సమీపంలోని జయమంగళి నది వంతెన సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో కమ్ముకున్న మంచు తెరల కారణంగా వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులను డ్రైవర్ ఆలస్యంగా గుర్తించి కారు వేగాన్ని నియంత్రించే క్రమంలో అదుపు తప్పి పల్టీలు కొడుతూ నేరుగా వెళ్లి బ్రిడ్జి సైడ్‌వాల్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఇద్దరు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలు
శుక్రవారం తెల్లవారుజామున నేతులపల్లి వద్ద ఘటన
పొగమంచుతో రోడ్డు కనిపించక అనర్థం


