చెడ్డీ గ్యాంగ్‌తో జాగ్రత్త!
● ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు
● దుండగులు మడకశిర ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అనుమానం
మడకశిర: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి లూటీ చేయడం... ఆర్ధరాత్రి వేళ కాలింగ్ బెల్ నొక్కి తలుపుతీయగానే ఇంట్లోకి దూరి ఇంటిని కొల్లగొట్టే చెడ్డీగ్యాంగ్ జిల్లాలో సంచరిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మడకశిర పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా మడకశిర పట్టణ శివారు ప్రాంతంలో ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మడకశిర అర్బన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ లావణ్య చెడ్డీగ్యాంగ్ సభ్యుల ఫొటోలను విడుదల చేశారు. గ్యాంగ్ సభ్యులు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో ఎవరైనా తలుపులు తట్టినా, కాలింగ్ బెల్ నొక్కినా, ప్రమాదంలో ఉన్నామని అరిచినా.... వెంటనే తలుపులు తీయవద్దన్నారు. అవతల వ్యక్తులు ఎవరని నిర్ధారించుకున్న తర్వాతే తలుపులు తీయాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనబడినా, అనుమానం కలిగే విధంగా వ్యవహరించినా... వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వీలున్న వారు ఇళ్లవద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇళ్లల్లో నగదు, విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఉంచుకోకుండా... బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచాలని సూచించారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులను ఎవరైనా గుర్తిస్తే వెంటనే 9490112475, 9440796820 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


