తోటలను కప్పేసిన దుమ్ము
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో మట్టి మాఫియా వెర్రితలలు వేస్తోంది. మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతుండడంతో రోడ్డు పక్కన ఉన్న తోటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. కొండలు, గుట్టల్లోకి దారులు ఏర్పాటు చేసుకుని మట్టిని తరలిస్తూ రూ.లక్షల్లో డబ్బు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒకపక్క చిత్రావతి, హగరి, పెన్నా ,భద్రావతి, వంగపేరు వంటి నదుల నుంచి ఇసుక అక్రమ తరలింపులతో పాటు మట్టిని కొల్లగొడుతుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు సాగిస్తున్న ఈ అక్రమాలకు అమాయక రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు.
కనుమరుగవుతున్న గుట్టలు..
కొత్తచెరువు నల్లగుట్టలో మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకోవడంతో ఏకంగా రెండు కిలోమీటర్ల మేర గుట్ట మాయమైంది. అలాగే నాగులకనుమ నుంచి రైల్వే లైను సొరంగం వరకూ భారీగా మట్టిని తరలించారు. ఇదే మండలంలోని గంటల మారెమ్మ కనుమ వద్ద ఇటీవల భారీగా మట్టిని తరలించారు. ఈ మట్టిని కర్ణాటక వరకూ తరలించేందుకు సమీపంలోని గుట్టల్లో ప్రత్యేకంగా మట్టి దారిని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు తిరుగుతుండడంతో రహదారికి ఇరువైపులా ఉన్న మామిడి, ఇతర తీగ జాతి పంటలు కాస్త మట్టి కొట్టుకుపోతున్నాయి. కీలకమైన దశలో మామిడి తోటలపై భారీగా దుమ్ము పడడంతో పూత, పిందె రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు, వీరాంజనేయపల్లి, కర్ణాటక నాగేపల్లి వద్ద తోటలు పూర్తిగా మట్టితో నిండిపోయాయి. హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు, కిరికెర కొండల్లోనూ భారీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. అటువైపు ఉన్న నీలగిరి, మామిడి, మిరప, పత్తి పంటలు దెబ్బ తిన్నాయి. ధర్మవరం మండలంలోని ఓబుళనాయనిపల్లి ప్రాంతంలో మట్టిని భారీగా తరలించడంతో ఆ మార్గంలో ఉన్న అరటి, మామిడి, చీనీ తోటలు దెబ్బతిన్నాయి. కదిరిలోని బియ్యం గోదాము వెనుక ఉన్న కొండను ఇష్టరాజ్యంగా పెకలించి అక్రమంగా మట్టిని తరలిస్తుంటే ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి జేసీబీలు, టిప్పర్లను సీజ్ చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మేల్కోని మట్టి అక్రమ తరలింపులను అడ్డుకుంటే రైతులకు మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోవడంతో అన్నదాతలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొండలు, గుట్టల్లోకి మట్టి దారులు ఏర్పాటు చేసుకున్న స్వార్థపరులు యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా చేపట్టారు. ఒకట్రెండు కాదు... రేయింబవళ్లూ పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుండడంతో రహదారులపై దుమ్ము ఎగిసి పడి పక్కనే ఉన్న మామిడి తోటలను కప్పేస్తోంది. దీంతో కీలకమైన దశలో పూత రాక మామిడి రైతులు నష్టాలను మూట గట్టుకుంటున్నారు.
మట్టి అక్రమ రవాణాతో దెబ్బతింటున్న మామిడి తోటలు
కీలకమైన దశలో పూత రాక ఇబ్బందులు
మట్టి దోపిడీని అరికట్టాలంటున్న రైతులు


