రేషన్ బియ్యం పట్టివేత
సోమందేపల్లి: అక్రమంగా ఐచర్ వాహనంలో తరలిస్తున్న 68 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమందేపల్లిలో రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఓ గోదాము నుంచి రేషన్ బియ్యాన్ని ఐచర్ వాహనంలో లోడు చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఇన్‌చార్జ్ తహసీల్దార్ మారుతి వెంటనే అప్రమత్తమై సిబ్బందిని రంగంలో దించారు. అప్పటికే సోమందేపల్లికి చేరుకున్న వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయడంతో 136 బస్తాల్లో తరలిస్తున్న 68 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడింది. వాహనాన్ని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం బియ్యం తరలిస్తున్న హుస్సేన్ పీరాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తిపై కేసు నమోదు
కదిరి టౌన్: మహిళలపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కదిరి మున్సిపల్ పరిధిలోని పిల్లవంక కాలనీలో నివాసముంటున్న అంజినప్ప ఇంటి ఎదురుగా ఉంటున్న శాంతమ్మకు ఇంటి పక్కనే ఉన్న రమణతో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకున్న రమణ శుక్రవారం ఉదయం శాంతమ్మపై కట్టెతో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డుకోబోయిన అంజినప్ప భార్యపై కూడా దాడికి తెగబడ్డాడు. ఘటనపై అంజినప్ప ఫిర్యాదు మేరకు రమణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి దుర్మరణం
కదిరి టౌన్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం రామనూతనపల్లి గ్రామానికి చెందిన మజుల రామచంద్ర కుమారుడు అశోక్ (26) కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ గుడి వద్దకు కూలి పని కోసం వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. కదిరి మున్సిపల్ పరిధిలోని పులివెందుల కొత్త బైపాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా దూసుకొచ్చిన జింకను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.
‘ఉచిత వైద్య సేవలు
సద్వినియోగం చేసుకోండి’
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రీయ బాల స్వస్త్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అందిస్తున్న ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 2,822 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,42,049 మంది పిల్లలకు గాను 1,28,730 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 2,058 ప్రభుత్వ పాఠశాలల్లోని 1,60,040 మంది విద్యార్ధులకు గాను ఇప్పటి వరకూ 1,19,212 మందికి ఆరోగ్య స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. పుట్టుకతో వచ్చే లోపాలు, బాల్యంలో వచ్చే వ్యాధులు, పోషకాహార లోపాలు, ఎదుగుదల లోపాలు కలిపి ఇప్పటి వరకూ 541 కేసులను గుర్తించామన్నారు. వీరికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
11న ధర్మవరంలో
సంక్రాంతి క్రీడాపోటీలు
పుట్టపర్తి టౌన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 11న ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సంక్రాంతి క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఎస్‌డీఓ కిషోర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాడాట, తొక్కుడు బిళ్ల, కర్రసాము, ఏడు పెంకులాట, తాడులాగుడు, గాలిపటాల పోటీలను నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు 98481 87636లో సంప్రదించవచ్చు.


