ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలి
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి అన్నారు. రసాయనాలు, క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించిన కల్తీలేని ఆహారోత్పత్తుల వినియోగంపై ప్రజలు దృష్టి సారిస్తే.., ప్రకృతి సేద్యం విస్తరిస్తుందని పేర్కొన్నారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక’ ఆధ్వర్యంలో 18 స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా అనంతపురంలోని పోలీసు కాంప్లెక్స్‌లోని కల్యాణమంటపం వేదికగా ఏర్పాటు చేసిన ‘మిల్లెట్ మేళా’కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండో రోజు శుక్రవారం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రైతులు, నగరవాసులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తరలివచ్చారు. చిరుధాన్యాలు, వాటితో చేసిన తినుబండారాలు, సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు, పూల ప్రదర్శనశాలలు, విక్రయశాలలను ఆసక్తిగా గమనించి కావాల్సిన వాటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వైవీ మల్లారెడ్డి, సీసీడీ ప్రతినిధి త్రిలోకనాథశాస్త్రి, ఏపీ మాస్ సీఈఓ సీఎస్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయ విభాగం చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (సీటీఐఓ) వి.లక్ష్మానాయక్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, తెలంగాణాకు చెందిన రైతు నరసింహారెడ్డి తదితరులు మాట్లాడారు. కష్టం రైతుది అయితే సంపాదన మాత్రం దళారులు, వ్యాపారులకు దక్కుతోందన్నారు. మార్కెటింగ్ మెలకువలు పాటిస్తే రైతు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. ప్రజారోగ్యం మెరుగుపడి అనారోగ్యానికి వెచ్చించే ఖర్చులు తగ్గాలంటే సేంద్రియ పద్ధతుల పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్స్ ప్రతినిధి భానుజా, కార్డు ప్రతినిధి నిర్మలారెడ్డి, ఆర్‌ఆర్‌ఏ నెట్‌వర్క్ ప్రతినిధి సుజుల్ కులకర్ణి, ఎఫ్‌ఈఎస్ వ్యవస్థాపకులు భక్తర్‌వలీ, ఏఎఫ్‌ఈసీ చీఫ్ అపరేషన్స్ జే.మురళీకృష్ణ, రిడ్స్ పీడీ వి.కిష్టప్పతో పాటు సీసీడీ, వాసన్, టింబక్టు, ఏపీమాస్, సీఎస్‌ఏ, జనజాగృతి, యాపిల్, పాస్, గ్రామ్‌వికాస్, అనంత నాచురల్స్, తిరుమల ఆర్గానిక్స్, డిజిటల్ గ్రీన్ తదితర ఎన్‌జీఓ ప్రతినిధులు శంకర్, గోపాల్, సుకన్య, ఉత్తప్ప, రమణ, శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, రామప్ప, తిరుపాలు, నరేంద్ర, విజయభాస్కర్, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
‘మిల్లెట్ మేళా’లో సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి


