ఆర్థిక లావాదేవీలే హత్యకు పురిగొల్పాయి
పుట్టపర్తి టౌన్: మాదినేని మహేష్ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు శివాంజనేయులు, మారుతీ శంకర్ వెల్లడించారు. ఈ నెల 1న కొత్తచెరువు మండలం తిప్పబాట్లపల్లికి చెందిన మహేష్ చౌదరి (31) మృతదేహం హంద్రీ–నీవా కాలువలో లభ్యమైందన్నారు. ఘటనపై మృతుడి తల్లి నాగరత్నమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో మారుతీ ప్రసాదరెడ్డి, వంశీకృష్ణ, లోకేష్, బాలమిత్ర, అభిషేక్ ను శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొత్తచెరువులోని తలమర్ల క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని వారు అంగీకరించడంతో హత్య సమయంలో వినియోగించిన ఇన్నోవా కారు, రెండు బైక్‌లు, ఇనుప పైపు, ఐదు సెల్‌ఫోన్లు, హతుడి ఈవీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మారుతీప్రసాద రెడ్డి, వంశీకిషోర్‌పై ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులు, రౌడీ సీట్ ఉంది, లోకేష్‌ౖపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి.
హత్య ఎలా చేశారంటే..
మారుతీ ప్రసాదరెడ్డి, లోకేష్, మహేష్‌చౌదరి ముగ్గురూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. మహేష్, లోకేష్ మధ్య ఈ నెల 1న గొడవ చోటు చేసుకుంది. కొత్తచెరువు పీఎస్‌లో మహేష్‌పై లోకేష్ కేసు నమోదు చేయించాడు. అదే రోజు ప్రశాంతి గ్రాం వద్ద ఉన్న మారుతీరెడ్డి గెస్ట్ హౌస్‌లో ఐదుగురు నిందితులు ఉండగా మహేష్ అక్కడికెళ్లి వారితో గొడవపడ్డాడు. దీంతో ఇనుపరాడ్, కర్రలతో మహేష్‌పై దాడి చేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మహేష్ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి ఇన్నోవా కారులో తీసుకెళ్లి సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో పడేశారు. అనుమానం రాకుండా హతుడి ఎలక్రికల్ వాహనం, ఇనుప రాడ్‌ను అక్కడే పడేసి వెళ్లిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేలా కొత్తచెరువులో ఊరేగిస్తూ న్యాయస్థానానికి తీసుకెళ్లారు.
మాదినేని మహేష్ హత్య కేసులో
వీడిన మిస్టరీ
నిందితుల అరెస్ట్


