సీమ ఉద్యమాల ‘కదలిక’
● రేపు ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ
అనంతపురం కల్చరల్: రాయలసీమ ఉద్యకారునిగా.. రచయితగా.. వ్యాసకర్తగా.. జర్నలిస్టుగా సీమ వాసులకు ఇమామ్ చిరపరిచితుడు. సుదీర్ఘకాలం తన స్వీయ సంపాదకీయంలో కదలిక పేరుతో పత్రిక నడిపిన ఆయన కదలిక ఇమామ్‌గా ఖ్యాతిగాంచారు. ముఖ్యంగా సీమ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన ఆయనకు వైఎస్సార్ కుటుంబంతో విడదీయలేని బాంధవ్యం ఉంది. నిఖార్సయిన జర్నలిస్టుగా, తన వాడి కలంతో ఎన్నో మెదళ్లను కదిలించారు. ప్రజా పోరాటాలలో నెలల తరబడి జైళ్లకూ వెళ్లారు. రాయలసీమలోని అన్ని జిల్లాల ఉద్యమకారులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఇమామ్.. ఆరు దశాబ్దాల పాటూ ప్రజా ఉద్యమాలను ఎంతో ప్రభావితం చేశారు. ఈ క్రమంలో నేటి తరం గుర్తుంచుకునేలా ఆయన జీవితం అక్షర రూపం దాల్చి ‘ఇమామ్ ప్రస్థానం’ పేరిట రూపుదిద్దుకుంది. వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాలతో మమేకమైన ‘ఇమామ్ ప్రస్థానం’ శనివారం అనంతపురంలోని మూడో రోడ్డు జీఆర్ మినీ ఫంక్షన్ హాలు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


