ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
బస్సు దిగి లగేజీ కోసం వెళ్లిన ప్రయాణికుడి కోసం ఒక్క క్షణం కూడా
వేచి చూడకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వెనక నుంచి కేకలు వేస్తూ పరుగున వస్తున్న ప్రయాణికుడి గురించి ఏ మాత్రమూ పట్టించుకోకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు వెనక పరుగు తీస్తూ ఎగశ్వాసతో గుండెపోటుకు
గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం కొత్తచెరువులో
ఈ ఘటన చోటు చేసుకుంది.
పుట్టపర్తి టౌన్: నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (33) పుట్టపర్తిలోని ఎస్‌బీఐ శాఖలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులకు హాజరైన ఆయన గురువారం ఉదయం డ్యూటీ దిగి స్వగ్రామానికి వెళ్లేందుకు పుట్టపర్తి నుంచి బయలుదేరి కొత్తచెరువుకు చేరుకున్నాడు. నల్లమాడకు వెళ్లే ఆర్టీసీ బస్సు రాగానే బస్సులో కొంత లగేజీ ఉంచి, మిగిలిన లగేజీ తీసుకొస్తానంటూ డ్రైవర్‌కు తెలిపి బస్సు దిగి వెళ్లాడు. ఆ సమయంలో డ్రైవర్ వేచి చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. గమనించిన పురుషోత్తం లగేజీతో బస్సు వెనకాల పరుగెడుతూ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఎగశ్వాసతో ఇబ్బంది పడుతూ ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు గుండెపోటుకు గురైనట్లుగా నిర్ధారించుకుని సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. అతని వద్ద లభ్యమైన ఆధారాలను పరిశీలించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారుడి మృతితో తల్లిదండ్రుల వేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మిగులు లగేజీ తెచ్చేందుకు
బస్సు దిగిన ప్రయాణికుడు
క్షణం కూడా వేచి చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చిన డ్రైవర్
లగేజీ ఎత్తుకుని బస్సు వెనుక
పరుగెడుతూ గుండెపోటుకు
గురైన వైనం
స్థానికులు సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు


