ఆసక్తిగా పాల దిగుబడి పోటీలు
రాప్తాడు రూరల్: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ’అనంత పాల ధార’ జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలు అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో గురువారం ఆసక్తిగా సాగాయి. ఉదయం 6 గంటల నుంచే శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, రాప్తాడు, అనంతపురం రూరల్ తదితర మండలాల నుంచి 59 మంది పాడి రైతులు ఉత్సాహంగా తమ పశువులతో పోటీలకు తరలివచ్చారు. పారదర్శకత, శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన పశువైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు, పాల కొలతలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మరోమారు పాల ఉత్పత్తి నమోదు చేశారు. ఉదయం, సాయంత్రం పాల దిగుబడుల ఆధారంగా విజేత పాడి పశువులను ఎంపిక చేశారు.
● దేశవాళీ ఆవుల విభాగంలో బీకేఎస్ మండలం ఎస్.కొండాపురానికి రైతు భరత్ ఆవు 10.58 కేజీలు, గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రైతు మహాలక్ష్మి రమణ ఆవు 8.16 కేజీలు, అదే గ్రామానికి చెందిన మహాలక్ష్మి శ్రీనివాసులు ఆవు 6.94 కేజీలతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
● గేదెల కేటగిరీలో బీకేఎస్ మండలం ఎస్.కొండాపురం గ్రామానికి చెందిన రైతు బుగ్గ శ్రీనివాసులు గేదె 24.38 కేజీలు, అదే గ్రామానికి చెందిన పోతులయ్య గేదె 19.18 కేజీలు, అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి రైతు శ్రావణ్‌కుమార్‌కు చెందిన గేదె 16.2 కేజీల పాలతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
● సంకరజాతి ఆవుల కేటగిరీలో శింగనమల మండలం చక్రాయపేటకు చెందిన రైతు ఏలేటి మధుసూదన్ రెడ్డి ఆవు 29. 42 కేజీలు, అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికి చెందిన మల్లె కృష్ణారెడ్డి ఆవు 27.04 కేజీలు, ఇటుకలపల్లికి చెందిన బండి ఉదయ్ కిరణ్ ఆవు 24.90 కేజీల పాలతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
దేశవాళీ ఆవులు, గేదెల కేటగిరీల పోటీల్లో ఎస్.కొండాపురం విజయం
సంకరజాతి ఆవుల కేటగిరీలో
చక్రాయపేట టాప్


