35వ కి.మీ. దాటిన కుడి కాలువ నీరు
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ఎస్కేప్ రెగ్యులేటర్ నుంచి కుడి కాలువకు మంగళవారం విడుదల చేసిన బుధవారం నాటికి 35వ కి.మీ.దాటి ఆత్మకూరు మండలంలోకి ప్రవేశించింది. పీఏబీఆర్ నుంచి ధర్మవరం నియోజకవర్గం అగ్రహారం చెరువు వరకు సుమారు 112 కి.మీ. పొడవునా ఈ కాలువ విస్తరించి ఉంది. కాలువ కింద ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులున్నాయి. సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా ఈ చెరులను నింపుతుంటారు. ఈ క్రమంలో కాలువ చిట్టచివరి చెరువును తొలుత నింపి ఆ తర్వాత డ్యాం దిగువన ఉన్న మరుట్ల చెరువును నింపేలా అధికారులు నిర్ణయించారు.
పాడి పోటీలకు సిద్ధం
రాప్తాడురూరల్: పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి గ్రామంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ‘అనంత పాలధార’ పాల దిగుబడి జిల్లా స్థాయి పోటీలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా నలమూలల నుంచి సుమారు 70 పాడి పశువులను తీసుకుని బుధవారం సాయంత్రానికి రైతులు అక్కడకు చేరుకున్నారు. పాడిపశువులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ప్రేమ్‌చంద్ పరిశీలించారు. గురువారం ఉదయం, సాయంత్రం రెండు పూటల పాలు తీసి కొలత లు వేయనున్నారు. ఎక్కువ శాతం పాలు ఇచ్చిన ఆవులను విజేతలుగా ప్రకటించనున్నారు. తర్వాత బహుమతులు అందజేయనున్నారు.
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● అడిషనల్ ఎస్పీ అంకిత సురానా
కనగానపల్లి: గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ట పరుస్తూ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఆదేశించారు. బుధవారం కనగానపల్లి పీఎస్‌ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, లాకప్ గదులు, మహిళా హెల్ప్ డెస్కును పరిశీలించారు. ప్రజలతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని పాటించాలని సిబ్బందికి సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాత్రి వేళల్లో గస్తీ చేపట్టాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. పేకాట, గంజాయి, మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించాలన్నారు. పిల్లలు, మహిళలపై జరిగే అకృత్యాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రామగిరి సీఐ శ్రీధర్, కనగానపల్లి ఎస్‌ఐ ఎం.రిజ్వాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటి పన్ను చెల్లించిన వారికి మాత్రమే అనుమతి
● శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో నోటీసు.. విస్తుపోతున్న ప్రజలు
శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వద్దకు వెళ్లాలన్నా నిబంధనలు అమలు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే అనంతపురం జిల్లా శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో అతికించిన నోటీసు. పనుల కోసం వచ్చే ప్రజలు ఇంటి పన్ను చెల్లించి ఉండాలని, ఇంటి పన్ను చెల్లించిన రశీదు జిరాక్స్ పత్రాన్ని తీసుకువస్తేనే అనుమతి ఇస్తామని ఇన్‌చార్జ్ ఎంపీడీఓ భాస్కర్ పేరిట కార్యాలయంలో నోటీసు అతికించారు. 2025–26 సంవత్సరం వరకు ఇంటి పన్ను చెల్లించి ఉండాలని, అలాంటి వారినే అనుమతిస్తామని, ఇది ప్రభుత్వ ఉత్తర్వు అని, ప్రజలందరూ గౌరవించి సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదెక్కడి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు.
35వ కి.మీ. దాటిన కుడి కాలువ నీరు
35వ కి.మీ. దాటిన కుడి కాలువ నీరు
35వ కి.మీ. దాటిన కుడి కాలువ నీరు


