హత్య కేసులో నిందితుల అరెస్ట్
తనకల్లు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకల్లు పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి వెల్లడించారు. స్థానిక మండలంలోని రాగినేపల్లికి చెందిన ఎర్రి హరి తన భార్య నాగ శిరీష కనిపించడం లేదని ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్పురీవాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప తన భార్యను ఏటో తీసుకెళ్లాడంటూ ఫిర్యాదులో అనుమానాలు వ్యక్తం చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో తిరుపతి జిల్లా గూడూరులో తలదాచుకున్న ఈశ్వరప్ప, నాగశిరీషతో పాటు రమ్య అనే యువతిని ఈ నెల 4న ఆధీనంలోకి తీసుకుని అదే రోజు రాత్రి అక్కడి నుంచి స్కార్పియో వాహనంలో తిరుగు ప్రయాణయ్యారు. నాగ శిరీషాను గుర్తు పట్టేందుకు భర్త ఎర్రి హరిని కూడా ఆ సమయంలో పోలీసులు తమ వెంట గూడూరుకు పిలుచుకెళ్లారు.
స్టేషన్ ఎదుటనే దారుణం
భార్య కనిపించకుండా పోవడం... ఈశ్వరప్పపై అనుమానాలు బలపడడంతో ఎర్రి హరి కక్షతో రగలిపోయాడు. ఈ నేపథ్యంలో తన అన్న చిన్నప్ప, దూరపు బంధువు శంకరప్ప, గంగులప్పతో కలసి ఎలాగైనా ఈశ్వరప్పను హతమార్చాలని పథకం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులతో పాటు గూడూరుకు స్కార్పియో వాహన డ్రైవర్‌గా గంగులప్పను పిలుచుకెళ్లాడు. అక్కడ భార్యను గుర్తు పట్టిన అనంతరం ఆమెతో పాటు రమ్య, ఈశ్వరప్పను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని అదే స్కార్పియో వాహనంలో తనకల్లుకు తిరుగు ప్రయాణయ్యారు. ఈ విషయాన్ని తన సోదరుడు చిన్నప్పకు ఎర్రి హరి తెలిపి ప్రణాళిక మేరకు సిద్ధంగా ఉండాలన్నాడు. దీంతో చిన్నప్ప, శంకరప్ప రెండు వేట కొడవళ్లతో పోలీస్‌స్టేషన్ వద్ద మాటు వేశారు. ఈ నెల 5న తెల్లవారుజామున తనకల్లు పీఎస్ ఎదుట వాహనం ఆగగానే హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, హోంగార్డు కిందకు దిగి పోలీస్ స్టేషన్‌లోకి వెళుతుండగా వెనుకనే అనుసరిస్తున్న ఈశ్వరప్పను ఎర్రి హరి పక్కకు నెట్టేశాడు. అదే సమయంలో వేట కొడవళ్లతో చిన్నప్ప, శంకరప్ప అక్కడకు చేరుకోగానే ఓ కొడవలిని ఎర్రి హరి అందిపుచ్చుకుని అన్న చిన్నప్పతో కలసి ఈశ్వరప్పను చుట్టుముట్టాడు. ఇద్దరూ కలసి ఈశ్వరప్పను విచక్షణారహితంగా నరికి హతమార్చారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన పోలీసులను బెదిరించి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ గోపి.. పక్కా ఆధారాలతో బుధవారం ఉదయం రాగినేపల్లి క్రాస్ వద్ద ఎర్రి హరి, చిన్నప్ప, శంకరప్ప, గంగులప్పను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విచారణలో నేరాన్ని వారు అంగీకరించడంతో స్కార్పియో వాహనంతో పాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లను స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ఈ నెల 5న పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి దారుణ హత్య
నలుగురి అరెస్ట్


