టీడీపీ నాయకుల కబ్జాపై ఫిర్యాదు
కనగానపల్లి: ప్రభుత్వం నుంచి పట్టా పొంది ఇల్లు నిర్మించుకున్న స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు ఎరికల వెంకట్రాముడు వాపోయాడు. దీనిపై బుధవారం కనగానపల్లి రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడాడు. 15 సంవత్సరాల నుంచి గుంతపల్లిలోని ఎస్సీ కాలనీ పక్కన నివాసం ఉంటున్న తనకు సర్వే నంబర్ 487–2లో ఇంటి పట్టాతో పాటు పక్కా గృహాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే తాను నివాసముంటున్నానని పేర్కొన్నాడు. రెండు రోజుల క్రితం తాము గ్రామంలో లేని సమయంలో టీడీపీ నాయకులు డీలర్ బొజ్జన్న, నాగభూషణ, పోతుల సుధాకర్, గొల్ల ప్రసాద్, సుధాకర్ జేసీబీతో ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న పచ్చని చెట్లను పీకి, అక్కడ ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి నేలను చదును చేశారన్నారు. తాను గ్రామానికి వచ్చినప్పుడు వెళ్లి వారిని నిలదీయగా ‘నీకు ఇక్కడ ఎవరు పట్టా ఇచ్చారు’ అంటూ కులం పేరుతో దూషించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా చూపించేందుకు వెళితే అది నకిలీదని, కట్టెలతో దాడి చేసేందుకు ప్రయత్నించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కనగానపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని రెవెన్యూ అధికారులు, పోలీసులను కోరినట్లు వివరించాడు.


