సీటీఎస్ కార్మికులను తొలగించరాదు
గుంతకల్లు: సీటీఎస్ కార్మికులను తొలగించారాదని సీఐటీయూ నాయకుడు సాకే నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో పని చేస్తున్న సీటీఎస్ కార్మికులను ఉన్నఫలంగా తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి డీఆర్‌ఎం కార్యాలయం వరకు నిరసన రిలే నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. 18 ఏళ్లుగా దాదాపు 85 మంది కార్మికులు సీటీఎస్ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన సబ్ కాంట్రాక్టరు కేవలం 50 మందిని మాత్రమే పనిలో ఉంచుకుని మిగిలినవారిని తొలగించామని చెబుతుండడం దుర్మార్గమన్నారు. ఏ ఒక్క కార్మికుడినీ తొలగించరాదని, కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, చిరంజీవి, ఆంజనేయులు, జయరాజు, అలిగేరప్ప, వీరేష్, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ
రాయదుర్గం టౌన్: స్థానిక జాతీయ రహదారి బైపాస్‌లో శ్మశాన వాటిక వద్ద ఉన్న వాహన సర్వీసింగ్ సెంటర్ షెడ్డు రేకులు కత్తిరించి దొంగతనానికి పాల్పడుతున్న ఓ యువకుడిని సోమవారం అర్ధరాత్రి స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.తాళం వేసిన షెడ్డు పైభాగంలో రేకులు కత్తిరించి లోపలికి వెళ్లిన దుండగుడిని గమనించిన కొందరు అక్కడే కాపు కాశారు. కాసేపటి తర్వాత యువకుడు బయటకు రాగా వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


