పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పాడి సంపద వృద్ధి చెందేలా చేసి పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో అధికారులు పని చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశు సంపద ద్వారా జిల్లా జీడీపీ వృద్ధికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెరుగైన జాతి అభివృద్ధి, వ్యాధి నియంత్రణ, మార్కెట్ అనుసంధానం పెంచాలన్నారు. డెయిరీ అభివృద్ధి కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సెర్ప్‌తో సమన్వయం చేసుకొని స్వయం సహాయ సంఘాలకు పశు సంపద ఆధారిత జీవనోపాధి యూనిట్లను వేగంగా మంజూరు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాలు, పశుషెడ్లు, పశు మేత పంటలు, ఇంటిగ్రేటెడ్ అనిమల్ హాస్టళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
‘పేద ఖైదీలకు సహాయం’
పక్కాగా అమలవ్వాలి
పేద ఖైదీలకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘పేద ఖైదీలకు సహాయం’ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాధికార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఒక్కో ఖైదీకి గరిష్టంగా రూ.50 వేల వరకూ ఆర్థిక సహాయం 5 రోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇతర విధానాల్లో న్యాయస్థానానికి అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. జరిమానా మొత్తాన్ని చెల్లించలేక దోషిగా తేలిన వ్యక్తి జైలు నుంచి విడుదల కాకుంటే జైలు సూపరింటెండెంట్ 7 రోజుల్లో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జైలు సందర్శక న్యాయవాది, పారా లీగల్ వలంటీర్, జిల్లా ప్రొబేషన్ అధికారి తదితరుల సహకారంతో 7 రోజుల్లో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలు అధికారులు ఉమామహేశ్వర నాయుడు, శివరామకృష్ణ, హనుమప్ప, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్


