అండర్ –14 క్రికెట్ క్రీడాకారుల ఎంపికకు 95 మంది హాజ
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 క్రికెట్ క్రీడాకారుల ఎంపికకు శ్రీసత్యసాయి జిల్లా నుంచి 95 మంది హాజరయ్యారు. సోమవారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేపట్టిన ఎంపిక ప్రక్రియను టాలెంట్ కమిటీ సభ్యులు షేక్ హుస్సేన్, శరత్ పర్యవేక్షించారు.
‘పురం’ వాసికి అంతర్జాతీయ ఫిడే రేటింగ్
హిందూపురం టౌన్: స్థానిక పాంచజన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సాయిఈశ్వర్ చదరంగంలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించాడు. గత నెల కన్నూర్‌లో జరిగిన క్లాసిక్ చెస్ టోర్నీలో 1,569 రేటింగ్ సాధించినట్లు కోచ్ గోపీనాథ్ వెల్లడించారు. అలాగే తుముకూరు, బెంగళూరులో జరిగిన కలాంధ్రపన, మ్యాజిక్ స్క్వేర్, ఇంటర్నేషనల్ రాపిడ్ టోర్నమెంట్లలో పాల్గొని ఈఎల్‌ఓ 1,410 రేటింగ్ సాధించాడన్నారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వర్‌ను పాఠశాల యాజమాన్యం, కోచ్, తల్లిదండ్రులు అభినందించారు.
మెరుగు పేరుతో బంగారం అపహరణ
గార్లదిన్నె: మెరుగు పెడతామని నమ్మించి మేలిమి బంగారాన్ని అపహరించుకెళ్లిన ఘటన గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కృష్ణాపురంలో నివాసముంటున్న సుగుణమ్మ సోమవారం ఉదయం ఇంట్లో కోడలు, బావతో కలసి ఉన్న సమయంలో ఇద్దరు యువకులు చేరుకుని బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని తెలిపారు. దీంతో మొదట ఇత్తడి దండ, వెండి కాలి పట్టీలు ఇవ్వడంతో వాటికి మెరుగుపట్టి ఇచ్చారు. అనంతరం వారి మాటలు నమ్మి తన మెడలోని బంగారు తాళిబొట్టు చైన్ ఇవ్వడంతో వారి ముందే గిన్నె నీటిలో మరిగించి తాళిబొట్టు చైన్‌ను అందులో వేసి కలకండ లాంటి పదార్థాన్ని కలిపారు. కొద్ది సేపటి తర్వాత మరిగే నీటిలోకి కొద్దిగా పసుపు వేయాలనడంతో సుగుణమ్మ అలాగే చేసింది. ఆ సమయంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించి ఇంట్లో ఉన్న ముగ్గురూ స్పృహ కోల్పోయారు. అనంతరం యువకులు బంగారు తాళిబొట్టు చైన్ తీసుకుని తామొచ్చిన ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. కొద్దిసేపటికి కోలుకున్న వారు తాము మోసపోయినట్లుగా నిర్దారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్యపై హత్యాయత్నం
పెద్దవడుగూరు: మండలంలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన వివాహిత మాధవిపై ఆమె భర్త ఈశ్వరరెడ్డి ఆదివారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన మాధవిని కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఈశ్వరరెడ్డి కొంత కాలంగా ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో కత్తితో భార్యను పొడిచి ఈశ్వరరెడ్డి పారిపోయాడు. ఈశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అండర్ –14 క్రికెట్ క్రీడాకారుల ఎంపికకు 95 మంది హాజ


