పురుగు మందు దెబ్బకు మోడువారిన చీనీ చెట్లు
పుట్టపర్తి అర్బన్: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా తన పరిస్థితి మారిందని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎదుట ముదిగుబ్బ మండలం వలిమి చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు దేవేంద్ర వాపోయాడు. తన సమస్యను కలెక్టర్‌కు వివరించిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడాడు. తనకున్న 5 ఎకరాల్లో చీనీ సాగు చేపట్టానని, 9 ఏళ్ల వయసున్న చీనీ చెట్లకు వ్యాధి సోకడంతో తాను మామూలుగా మందులు కొనుగోలులో చేసే ముదిగుబ్బలోని లక్ష్మీనరసింహ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్‌నకు గత ఏడాది నవంబర్ 26న వెళ్లి అక్కడి యజమాని చంద్రశేఖరనాయుడు సూచన మేరకు రూ.13,480 వెచ్చించి పురుగు నివారణ మందులు కొనుగోలు చేసినట్లు వివరించాడు. చంద్రశేఖర నాయుడు సూచించిన విధంగానే వాటిని చీనీ చెట్లపై పిచికారీ చేసిన నాలుగు రోజులకే చెట్లకు ఉన్న వందలాది టన్నుల చీనీ కాయలు, ఆకులు మొత్తం రాలిపోయాయన్నాడు. చెట్లు కూడా మోడువారి మరో రెండేళ్ల వరకూ పంట చేతికి అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని చంద్రశేఖరనాయుడు దృష్టికి తీసుకెళ్లి తనకు పరిహారం చెల్లించాలని కోరితే ఎలాంటి పరిస్థితుల్లోనూ పరిహారం చెల్లించేది లేదని బెదిరింపులకు దిగాడని వాపోయాడు. అంతేకాక తమకు యూనియన్ ఉందని, తాను చెప్పినట్లుగానే ఉద్యాన అధికారులు నడుచుకుంటారని, తననేమీ చేసుకోలేవంటూ హెచ్చరికలు చేశాడని తెలిపాడు దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నట్లు వివరించాడు. సుమారు రూ.10 లక్షలకు పైగా నష్ట వాటిల్లిందని ఆదుకోవాలని విన్నవించినట్లుగా తెలిపాడు.
నట్టేట ముంచిన ఫర్టిలైజర్ షాపు యజమాని
కలెక్టర్ ఎదుట వాపోయిన బాధిత రైతు
పురుగు మందు దెబ్బకు మోడువారిన చీనీ చెట్లు


