హెచ్‌ఎం అక్రమాలపై డీఈఓ విచారణ
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దల ఉన్నత పాఠశాల పూర్వపు హెచ్‌ఎం అక్రమాలపై డీఈఓ క్రిష్టప్ప సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. 2022–25 సంవత్సరంలో ఫేజ్–1 నాడు–నేడు కింద రూ.59లక్షల నిధులతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన రామచంద్ర అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు అందాయి. దీంతో డీఈఓ క్రిష్టప్ప విచారణ చేపట్టారు. పనులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు పరిశీలించారు. రామచంద్రతో పాటు ప్రస్తుత హెచ్‌ఎం ఆనందనాయక్, పలువురు ఉపాధ్యాయులను డీఈఓ విచారించారు. బిల్లుల మంజూరులో సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై విచారణ చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. నివేదికను ఆర్‌జేడీకి పంపి తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నిందితుల కోసం
ముమ్మర గాలింపు
పుట్టపర్తి టౌన్: స్థానిక హంద్రీ–నీవా కాలువలో కొత్తచెరువు మండలం తిప్పబాట్లపల్లికి చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి మహేష్ చౌదరి (35) మృత దేహం లభ్యమైన కేసులో తల్లి ఫిర్యాదు మేరకు అనుమానిత నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. భూములు వ్యాపారం విషయంగా తలమర్ల మారుతీరెడ్డి, బాలమిత్ర, లోకేష్, కిషోర్‌తో తన కుమారుడికి గొడవలు ఉన్నాయని, ఈ వివాదంపై గతంలోనూ కొత్తచెరువు పీఎస్‌లో పంచాయితీలు జరిగాయని, ఈ క్రమంలోనే పథకం ప్రకారం తనకుమారుడిని హతమార్చి హంద్రీనీవా కాలువలో పడవేశారంటూ పుట్టపర్తి అర్బన్ పీఎస్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ విజయ్‌కుమార్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి అనుమానిత నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
8న కాకినాడలో ఖేలో
ఇండియా ట్రైబల్ పోటీలు
పుట్టపర్తి టౌన్: ఈ నెల 8న కాకినాడ వేదికగా ఖేలో ఇండియా ట్రైబల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు డీఎస్‌డీఓ కిషోర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ ఏజ్ కేటగిరిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్‌బాల్ తదితర క్రీడల్లో ఎంపికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించాలనే ఆసక్తి ఉన్న వారు ఈ నెల 8న ఉదయం 9 గంటలకు కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో రిపోర్టు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్టీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి.


