8 నుంచి ‘అనంత’లో మిల్లెట్ మేళా
అనంతపురం అగ్రికల్చర్: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలోని పోలీస్ కాంప్లెక్స్‌లోని ఫంక్షన్ హాల్ వేదికగా ‘మిల్లెట్ మేళా’ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌జీఓ, ఎఫ్‌పీఓ ప్రతినిధులు సంయుక్తంగా వెల్లడించారు. సోమవారం స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక తరపున ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎన్‌జీఓలు, ఎఫ్‌పీఓలు మొత్తం 18 సంస్థలు సంయుక్తంగా మిల్లెట్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ‘ప్రకృతి వ్యవసాయం, ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం’ అనే అంశాలను ప్రధానంగా తీసుకుని 20 వరకు ఆహారోత్పత్తుల ప్రదర్శన శాలలు, అమ్మకాలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’, అంతర్జాతీయ ఉమ్మడి వనరులు, పశువులు, జీవాల పెంపకం సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి గుర్తించిన నేపథ్యంలో ‘మిల్లెట్ మేళా’లోనూ వాటికి ప్రాధాన్యతనిస్తూ రోజుకో అంశంపై చర్చలు, సమాలోచనలు, భవిష్యత్ కార్యాచరణ అంశాల గురించి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. రైతులు, మహిళలు, అలాగే నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎఫ్‌ఈఎస్ వ్యవస్థాపకులు భక్తర్‌వలి, ఏఎఫ్‌ఈసీ చీఫ్ ఆపరేషన్స్ జె.మురళీకృష్ణ, రిడ్స్ పీడీ వి.కిష్టప్ప, రెడ్స్ ఫౌండర్ భానుజాతో పాటు సీసీడీ, వాసన్, టింబక్టు, ఏపీ మాస్, సీఎస్‌ఏ, జనజాగృతి, యాపిల్, పాస్, కార్డు, గ్రామ్‌వికాస్, అనంత నాచురల్స్, తిరుమల ఆర్గానిక్స్, డిజిటల్ గ్రీన్ తదితర ఎన్‌జీఓ, ఎఫ్‌పీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ
జయప్రదం చేయాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి పిలుపు


