వికసిత్ భారత్ లక్ష్య సాధనకు గ్రామ సభలే పునాది
పుట్టపర్తి అర్బన్: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్ (వీబీ జీ రామ్‌జీ) కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో గ్రామ సభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వీబీ జీ రామ్ జీ గ్రామ సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలను భాగస్వాములను చేయాలన్నారు. మెరుగన హామీ, దృఢమైన నిబద్ధత, సమర్థ పాలన, ఇదే వికసిత్ భారత లక్ష్యమన్నారు. గ్రామ సభలు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రజల భాగస్వామ్యంతో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, ఏపీడీ రమేష్‌బాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


