చిలగడ సాగు.. లాభాలు బాగు
కనగానపల్లి: కారణాలు ఏవైనా కావచ్చు.. వ్యవసాయం భారంగా పరిణమిస్తున్న ప్రస్తుత రోజుల్లో వినూత్న పంటల సాగుపై రైతులు ప్రయోగాలు సాగిస్తూ లాభాలు గడిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే కనగానపల్లి మండలం మద్దెలచెరువు తండాకు చెందిన రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన చిలగడదుంప సాగు సత్ఫలితాలను ఇస్తోంది. 50 కుటుంబాలు కూడా లేని ఈ గ్రామంలో 30 మంది రైతులు 50 ఎకరాల విస్తీర్ణంలో చిలగడదుంప సాగు చేపట్టడం గమనార్హం. పక్కనే ఉన్న అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రైతుల పొలాల్లో నుంచి తీగలను తీసుకువచ్చి ఈ పంటను సాగు చేస్తున్నారు. రూ. వేల పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక పంటలను సాగుచేసి ఎంతో నష్టపోయామని, తక్కువ కాలంలో చేతికి వచ్చే చిలగడదుంప సాగుతో మంచి ఆదాయం పొందుతున్నామని రైతులు సుబ్రహ్మణ్యం నాయక్, వెంకటేష్ నాయక్, రాజు నాయక్ తెలిపారు. అయితే పంటను విక్రయించేందుకు సమీపంలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
పెట్టుబడి తక్కువ..
చిలగడదుంప సాగుకు పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటాయని రైతులు అంటున్నారు. గతంలో పంట సాగు చేసిన పొలాల్లో నుంచి రైతుల అనుమతితో ఉచితంగా తీగలను కత్తిరించుకుని వచ్చి బాగా వదులుగా ఉన్న భూమిలో నాటాల్సి ఉంటుందన్నారు. తీగ నాటిన 120 రోజుల్లోనే దుంపలు ఏర్పడి పంట కోతకు వస్తుందన్నారు. క్రిమిసంహారక మందులు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, దుంపలు ఏర్పడిన తర్వాత నేలను బాగా దున్ని కూలీలతో దుంపలను సేకరించి, శుభ్రం చేసిన తర్వాత మార్కెట్‌కు తరలించాల్సి ఉంటుందన్నారు. సేద్యం, కూలీల ఖర్చులన్నీ కలిపి ఎకరానికి రూ.20 వేల వరకు ఖర్చు వస్తుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి ఆరు టన్నుల మేర దిగుబడి ఉంటుందని వివరిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ప్రస్తుత ధర ప్రకారం టన్ను రూ.20 వేలకు అమ్మినా ఎకరానికి రూ.లక్ష వరకు నికర ఆదాయం ఉంటుందని పేర్కొంటున్నారు.
తక్కువ శ్రమ, పెట్టుబడితో అధిక దిగుబడి
పోషకాలు పుష్కలంగా ఉన్న చిలగడ దుంపల సాగుతో రైతులు గంపెడు లాభాలు సాధిస్తున్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక పంటలు సాగు చేయలేని రైతులు తక్కువ శ్రమ, అంతే తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికి వచ్చే చిలగడదుంపల సాగు ప్రయోగాత్మకంగా చేపట్టి విజయం సాధించారు.
15 టన్నుల పంట దిగుబడి
రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎకరానికి రూ.20 వేల పెట్టుబడితో చిలగడదుంపల సాగు చేపట్టాను. సమీపంలోని గ్రామ రైతు పొలం నుంచి తీగలను తెచ్చి నాటాను. తక్కువ నీటితోనే 120 రోజుల్లో పంట చేతికి వచ్చింది. ఎకరానికి ఆరు టన్నులతో 15 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్ సౌకర్యం లేకపోవటంతో తక్కువ ధరకే దళారులకు పంటను విక్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
– సుబ్రహ్మణ్యం నాయక్, రైతు,
మద్దెలచెరువు తండా, కనగానపల్లి మండలం
చిలగడ సాగు.. లాభాలు బాగు
చిలగడ సాగు.. లాభాలు బాగు


