యువకుడి దుర్మరణం
మడకశిర రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం సి.రంగాపురం గ్రామానికి చెందిన రంగేగౌడ కుమారుడు ఈరేగౌడ (30) శనివారం వ్యక్తిగత పనిపై మడకశిరకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని అదే రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. సి.రంగాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయమైన ఈరేగౌడను వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ లావణ్య తెలిపారు.
ఓవరాల్ చాంపియన్‌గా ఆర్ట్స్ కళాశాల
అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. 112 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను, 172 పాయింట్లతో ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌ను ఆర్ట్స్ కళాశాల దక్కించుకుంది. విజేతలకు ఎస్కేయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ జేస్సీ, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.సహదేవుడు మెమొంటోలు బహూకరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు శ్రీరాం, శత్రుజ్ఞ, నగేష్‌నాయక్, వివిధ కళాశాలల నుంచి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
డీపీఓలో నేడు పరిష్కార వేదిక
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ ఇన్‌స్పైర్ కప్ టోర్నీ ప్రారంభం
అనంతపురం కార్పొరేషన్: ఆర్‌డీటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి అనంత క్రీడాగ్రామంలో ఫుట్‌బాల్ ఇన్‌స్పైర్ ఇన్విటేషన్ కప్ టోర్నీ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జట్లు బరిలో దిగాయి. దాదాపు 252 మంది మహిళా క్రీడాకారిణులు తరలివచ్చారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో థాండమ్ ఫౌండేషన్, ఫజల్ ఎఫ్‌సీ, కెంప్ ఎఫ్‌సీ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై సునాయాసంగా విజయం సాధించాయి. బెంగళూరు, టర్న్ ప్రో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నెల 10వ తేదీ వరకు టోర్నీ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అండర్–14 క్రికెటర్ల ఎంపికకు స్పందన
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 క్రికెట్ జట్టు ఎంపికకు స్పందన వచ్చింది. ఆదివారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేపట్టిన ఈ ప్రక్రియకు అనంతపురం జిల్లా నుంచి 161, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 95 మంది చొప్పున 255 మంది క్రీడాకారులు హాజరుకావడం విశేషం. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి పర్యవేక్షణలో క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, తదితర నైపుణ్యాలను టాలెంట్ కమిటీ సభ్యులు శరత్, షేక్ హుస్సేన్ పరిశీలించారు.
తాడిపత్రిలో మట్కా
నిర్వాహకుల గ్యాంగ్‌వార్
తాడిపత్రి టౌన్: స్థానిక గాంధీకట్ట సమీపంలో మట్కా నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం గ్యాంగ్‌వార్‌గా మారింది. కొంత కాలంగా తాడిపత్రిలో మట్కా నిర్వహణ విషయమై టీడీపీ నాయకుడు లప్పఖాజా, మరో టీడీపీ నాయకుడి ప్రధాన అనుచరుడు పండు మధ్య వివాదం నడుస్తోంది. ఆదివారం రాత్రి లప్పఖాజా, పండు వర్గాలు పరస్పర రాళ్ల దాడికి తెగబడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలోనూ ఈ రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో టీడీపీ పెద్దలు దుప్పటి పంచాయితీలతో సరిపెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మరోసారి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న సీఐ ఆరోహణరావు అక్కడకు చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
యువకుడి దుర్మరణం
యువకుడి దుర్మరణం


