జిల్లా సర్వేయర్ల అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా సర్వేయర్ల అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Jan 5 2026 7:35 AM | Updated on Jan 5 2026 7:35 AM

జిల్లా సర్వేయర్ల అసోసియేషన్‌ నూతన   కార్యవర్గం ఎన్నిక

జిల్లా సర్వేయర్ల అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

పుట్టపర్తి అర్బన్‌: జిల్లా విలేజ్‌ సర్వేయర్ల అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా మహేష్‌నాయుడు వ్యవహరించారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కార్తీక్‌, ఉపాధ్యక్షుడిగా సురేష్‌, కార్యదర్శిగా మనోహర్‌, సహాయ కార్యదర్శిగా బాలాజీ నాయక్‌, కోశాధికారిగా ఆనంద్‌, మహిళా విభాగం సెక్రెటరీగా రాధిక, ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ కార్యదర్శిగా రాజశేఖర్‌, వెల్ఫేర్‌ కార్యదర్శిగా చేతన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ కార్యదర్శిగా పవన్‌కుమార్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా బాలచంద్ర, లీగల్‌ అండ్‌ డిసిప్లినరీ సెక్రెటరీగా ప్రదీప్‌కుమార్‌, జిల్లా సలహాదారుగా అశ్వత్థనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వ ఉధ్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ నిరుద్యోగిని కూటమి నాయకులు మోసగించి సొమ్ము చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం సంతే కొండాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త హనుమంతరాయుడు పలువురు నిరుద్యోగులను కలసి ఎమ్మెల్యే అమిలినేనితో చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానమంటూ నమ్మబలుకుతూ వచ్చాడు. ఇతని మాయలో చిక్కుకున్న ఓ యువకుడు ప్రభుత్వాస్పత్రిలో అటెండర్‌ ఉద్యోగం కోసమని రూ.40 వేలను అప్పగించాడు. తన వద్ద అంత డబ్బు లేకపోయినా ఉద్యోగం వస్తుందన్న ఆశతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీ చెల్లించేలా అప్పు చేసి తీసుకువచ్చి ఇచ్చాడు. రోజులు గడుస్తున్న ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని తన డబ్బు వెనక్కు ఇవ్వాలని హనుమంతరాయుడిని అడిగాడు. డబ్బు వెనక్కు ఇవ్వడం కుదరని, ఉధ్యోగం ఇప్పించేలా ఇప్పటికే ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజతో మాట్లాడానని, త్వరలో పోస్టింగ్‌ ఆర్డర్‌ అందుతుందని ఆశలు కల్పించాడు. రెండు రోజులుగా హనుమంతరాయుడు పత్తాలేకుండా పోయాడు. అతనితో పాటు రోజూ తనతో ఫోన్‌లో మాట్లాడుతున్న దుర్గప్ప (హనుమంతరాయుడుకు బాస్‌గా) ను బాధితుడు ఆరా తీయగా.. రాయుడు చెప్పినట్లుగానే తాను ఫోన్‌లో మాట్లాడానని, ఈ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జారుకున్నాడు. దీంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి సోమవారం తీసుకెళ్లి న్యాయం కోరనున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.

గుట్టుగా కాలేజీల ఎగ్జిబిషన్‌ స్టాల్‌

పోలీసుల అదుపులో నిర్వాహకుడు

అనంతపురం సెంట్రల్‌: దేశంలోని ప్రముఖ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల కోసం అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్‌ వివాదాస్పదమైంది. మథర్‌ థెరిస్సా ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌ పేరుతో తాడిపత్రికి చెందిన జగదీష్‌ ఆదివారం విద్యుత్‌కళాభారతి ఫంక్షన్‌ హాల్‌లో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వివిధ కళాశాలల ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఫొటో ఫ్లెక్సీలో ఉండడంతో ఫిర్యాదులు అందుకున్న త్రీటౌన్‌ పోలీసులు నిర్వాహకుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించడంతో నిలిచిపోయింది. ఈ సందర్భంగా సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్‌ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు జరగడం లేదని, ఫలితాలు కూడా వెల్లడి కాలేదని, ఇలాంటి సమయంలో స్పాట్‌ అడ్మిషన్‌లంటూ ఎగ్జిబిషన్‌లు పెట్టడం అనుమానాలకు తావిచ్చిందన్నారు. విచారణలో విద్యాశాఖ, ఆర్‌ఐఓ నుంచి కూడా అనుమతి లేదనే విషయం నిర్ధారణ అయిందన్నారు. ఎగ్జిబిషన్‌కు వచ్చినవారు కళాశాలల ప్రతినిధులేనా అనే అనుమానాలున్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి, మోసం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించి ఉంటే కేసు నమోదు చేస్తానని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement