ఇల్లు దగ్ధం
గాండ్లపెంట: వంట గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఓ ఇల్లు దగ్ధమైంది. గాండ్లపెంట మండలం మలమీదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జిలాన్ భార్య షంషాద్ ఆదివారం ఉదయం వంట చేసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించిన సమయంలో వంట గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. మంటల తాకిడికి విద్యుత్ తీగల ఇన్సులేషన్ దెబ్బతిని షార్ట్‌సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు మరింతగా ఎగిసి పడ్డాయి. సమాచారం అందుకున్న కదిరి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు నిత్యావసర సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాబురావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఘటనపై బాధితులతో ఆరా తీశారు. అనంతరం నిత్యావసర సరుకులను అందజేశారు. జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. కాగా, ఘటన జరిగిన అనంతరం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలు ఆర్పే విధానంపై గ్రామస్తులకు ఫైర్ ఆఫీసర్ మహబుబ్‌సుబానీ ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆగ్నిమాపక సిబ్బంది దేవ్లానాయక్, ఉత్తమరెడ్డి, హరినాథరావు, పీవీ విజయ్‌భాస్కర్, అహమ్మద్ షా, షాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


