వ్యక్తిపై దాడి
గుత్తి రూరల్: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన మోహన్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు దాడికి తెగబడ్డారు. ఇటీవల మోహన్, ప్రత్యర్థుల మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలోని మసీదు వద్ద మోహన్ నడుచుకుంటూ వెళుతుండగా ప్రత్యర్థులు ఎదురుపడి గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గ్రామస్తులు సర్దిచెప్పి మోహన్‌ను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కర్నూలు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు.
సేవాగఢ్‌కు ఆర్టీసీ బస్సు ప్రారంభం
గుత్తి రూరల్: మండలంలోని సేవాగఢ్‌కు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఆర్టీసీ సూపరింటెండెంట్ కృష్ణానాయక్, కొర్ర జగన్నాథరావు ఆదివారం ప్రారంభించారు. ముందుగా సేవాగఢ్‌లోని సేవాలాల్ మహరాజ్, జగదాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15వ తేదీ వరకూ బస్సు నడుస్తుందన్నారు. గుత్తి బస్టాండ్ నుంచి ఉదయం 8.20 నిమిషాలకు బయలు దేరుతుందన్నారు. ఫిబ్రవరి 13, 14, 15వ తేదీలలో జరిగే సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త శ్రీమహారాజ్, రవీందర్ నాయక్, అశ్వర్థనాయక్, చక్రి నాయక్, బాలానాయక్, ఠాగూర్‌నాయక్ పాల్గొన్నారు.


