రాయలసీమ ద్రోహి చంద్రబాబు
కదిరి టౌన్: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. ఈ సారి కూడా రాయలసీమపై బాబు నిర్లక్ష్య వైఖరి బట్టబయలైందన్నారు. తన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారుతారనేందుకు ఇదే ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేశారని, ఇదే విషయాన్ని తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే వెల్లడించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయంలో అధికంగా కృష్ణా జలాలు ఆంద్రాకు తీసుకెళ్లారని,. తాను ఒక్క మాట చెబితే ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తారని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. లేకపోతే చరిత్ర హీనులుగా ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని హెచ్చరించారు.
కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్


