గంజాయి బ్యాచ్‌కు నడిరోడ్డుపై శిక్ష!
అనంతపురం సెంట్రల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాపై వన్‌టౌన్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నడిరోడ్డుపై నడిపించారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెలితే... నగరంలో అశోక్ నగర్‌లోని అలైఖ్య ఫంక్షన్‌హాల్ సమీపంలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను శనివారం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడు మండల పరిధిలోని మైనారిటీ కాలనీకి చెందిన సాయిప్రసాద్, రుద్రంపేటకు చెందిన శివ, స్టాలిన్‌నగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన షికారి జంపా అలియాస్ శివను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీరు రాప్తాడు మండలానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తి ద్వారా కిలోల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. అనేక మందిని గంజాయి మత్తులోకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి ముఠాకు ఫయాజ్ అలియాస్ బిస్కెట్ ఫయాజ్ డాన్‌గా ఉంటున్నాడు. ఇటీవల గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ జగదీష్ ఆదేశించడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా నగరంలోకి గంజాయిని సరఫరా చేస్తున్న వీరిపై వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం అక్కడి నుంచి జిల్లా కోర్టు వరకూ నడిరోడ్డుపై ఊరేగించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి బానిసలుగా మారిన యువతను డీ అడిక్షన్ సెంటర్‌కు పంపుతున్నట్లు వివరించారు.


