సస్యరక్షణతో అధిక దిగుబడులు
పుట్టపర్తి అర్బన్: సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక పంట దిగుబడులు సాధించవచ్చని ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రబీలో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలతో పాటు శనగ పంటను విస్తారంగా సాగు చేశారన్నారు. వరి నాటేటప్పుడు ఎరువులు ఎకరాకు 200 కిలోల సూపర్ ఫాస్పేట్, 50 కిలోల యూరియా, 25 కిలోల పోటాష్ వినియోగించాలన్నారు. వరిలో రెండు మీటర్లకు ఓ చోట 20 సెంటీమీటర్లు ఉండేటట్టు కాలిబాటలు వదలాలని, దీంతో గాలి బాగా సోకి చీడ పీడలను నివారిస్తుందన్నారు. వేరుశనగలో రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు నివారణకు ఇమిడా క్లోఫెడ్ 0.4 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. లద్దె పురుగు నివారణకు క్వినాల్ పాస్ 2.0 ఎంఎల్, తడియో కార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న వివిధ దశల్లో సాగులో ఉందని, దీనికి 20–30 రోజుల మధ్యలో యూరియా వాడాలన్నారు. కత్తెర పురుగు ఆశించి ఉంటే ఇమామెక్కిన్ బెంజిట్ 0.3 గ్రాములు లేదా రీనాక్సాపీర్ 0.3 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. శనగ పంటకు ఎండు తెగులు, తుప్పు తెగులు ఆశించకుండా ఎక్సోకొనజోల్ 2 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం సొసైటీ పరిధిలోని రైతులకు 140 బస్తాల యూరియా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ డీఆర్సీ శైలకుమారి, ఏఓ నటరాజ్, చైతన్య, సొసైటీ సీఈఓ చెన్నారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య


