పశుశాఖలో కొనసాగుతున్న ‘ఆడిట్’
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధక శాఖలో వెలుగుచూసిన సొమ్ము గోల్‌మాల్ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చే పనిలో ఆ శాఖ రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం నిమగ్నమైంది. రెండోసారి జిల్లాకు వచ్చిన అధికారులు మురళీబాబు, ఎం.చక్రధర్, ఎన్.గంగాశేఖర్ రెండో రోజు శనివారం ప్రత్యేక గదిలో మకాం వేసి బ్యాంకు ఖాతాలు, స్టేట్ మెంట్లు, ఇతరత్రా రికార్డులు లోతుగా శోధిస్తున్నారు. ఆడిట్ అధికారులు అడిగిన రికార్డులు, ఇతరత్రా పత్రాలు కార్యాలయ మేనేజర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు అందిస్తున్నారు. పశుశాఖకు సంబంధించి వివిధ బ్యాంకు అకౌంట్లలో ఖర్చు చేయని దాదాపు రూ.1.03 కోట్ల సొమ్మును ఎలాంటి అనుమతులు లేకుండా ఇరువురు తమ సొంత ఖాతాలు, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అభియోగాలు నమోదు కావడంతో గత నెలన్నర రోజులుగా విచారణ, పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒక సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయగా, విశ్రాంత అధికారికి రావాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రూ.42 లక్షల సొమ్మును నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు. ప్రాథమికంగా గుర్తించిన అక్రమాలకు సంబంధించి రెండో సారి ఆడిట్ బృందం మరింత సమగ్రంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. నివేదికను ముందుగా డైరెక్టరేట్‌కు అనంతరం ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.


