అర్ధరాత్రి హాహాకారాలు
● జాతీయ రహదారిపై పరస్పరం ఢీకొన్న వాహనాలు
● రెండు వాహనాల డ్రైవర్ల దుర్మరణం
మడకశిర రూరల్: మండలంలోని అగ్రంపల్లి గ్రామ సమీపంలో 544వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి హాహాకారాలు చెలరేగాయి. రెండు వాహనాలు పరస్సరం ఢీకొన్న ఘటనలో ఆయా వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... ఐచర్ వాహన డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మహమ్మద్ రఫీక్ (32) పెనుకొండ వద్ద కియా పరిశ్రమకు సంబంధించిన సామగ్రిని మహారాష్ట్రలోని పూణేలో అన్‌లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. అలాగే బొలెరో వాహన డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న రఘురామ్ (19) గురువారం గుడిబండ నుంచి పశువులను బొలెరోలో ఎక్కించి హిందూపురంలో దించి వెనుతిరిగాడు. ఈ రెండు వాహనాలు గురువారం అర్ధరాత్రి 544వ జాతీయ రహదారిపై అగ్రంపల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఐచర్ వాహనం బోల్తాపడింది. బొలెరో నుజ్జునుజ్జయింది. రఘురామ్, మహమ్మద్ రఫీక్ అక్కడికక్కడే మృతి చెందారు. రఘురామ్‌తో పాటు ఉన్న భువనేశ్వర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనతో 544వ జాతీయ రహదారిపై కాసేపు స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. మృతుడు రఘురామ్ తండ్రి శివానంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
అర్ధరాత్రి హాహాకారాలు


