ఇల్లు దగ్ధం
ఎన్‌పీకుంట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. వివరాలు.. ఎన్‌పీకుంట మండలం దిన్నిమీదపల్లి గ్రామ హరిజనవాడలో నివాసముంటున్న మల్లెం తిరుమల్లయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం పిల్లలను బడికి పంపించి, దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పురవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకుని ఇంటికి చేరుకుని మంటలు ఆర్పే లోపు నిత్యావసర సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు, బీరువాలో దాచిన రూ.2.80 లక్షల నగదు, మూడు తులాల బంగారం. పట్టాదారు పాసుపుస్తకం, ఎల్‌ఐసీ బాండ్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎస్‌ఐ వలీబాషా, అగ్నిమాపక శాఖ ఇన్‌స్పెక్టర్ మహబూబ్ సుబహాని అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడికి నిత్యావసర సరుకులు అందజేశారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు ఫైర్ ఇన్‌స్పెక్టర్ అవగాహన కల్పించారు.


