నాడు భర్త.. నేడు భార్య మృతి
● అనాథలైన పిల్లలు
ముదిగుబ్బ: సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విధి చిన్నచూపు చూసింది. ఎనిమిది నెలల క్రితం ఆకస్మిక మరణం పొందాడు. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగలడం అందరినీ కలచివేసింది. వివరాలిలా ఉన్నాయి. నల్లచెరువు మోడల్ స్కూల్‌లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి (46) ముదిగుబ్బలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త, ఇద్దరు కుమారులతో కలిసి సంతోషంగా జీవనం సాగించేది. ఊహించని విధంగా ఎనిమిది నెలల కిందట భర్త కరుణాకర్‌రెడ్డి గుండెపోటుతో ప్రాణం విడిచాడు. వీరి కుమారులు హిమాన్ష్‌రెడ్డి ఇంటర్, చాణక్య ఏడో తరగతి చదువుతున్నారు. బాధను పంటిబిగువనే భరిస్తూ పిల్లలకు ‘నేనున్నానంటూ’ ధైర్యం చెప్పింది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. అయితే విధి మరోసారి వీరి కుటుంబంపై పగబట్టింది. ఈసారి వరలక్ష్మిని దీర్ఘకాలిక వ్యాధి కబళించింది. కొన్ని రోజులుగా బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరలక్ష్మి మంగళవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు, స్థానికులు, బంధువులు అనాథలైన పిల్లల భవిష్యత్తును తలచుకుని కన్నీరు పెట్టారు. ఇంత నిర్దయగా పిల్లలను దిక్కులేని వాళ్లను చేశావా దేవుడా అంటూ విలపించారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
అమరాపురం/ మడకశిర రూరల్/ గుడిబండ: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. మంగళవారం అమరాపురం మండలం హేమావతిలోని అతిథి భవనంలో వివిధ శాఖల అధికారులతో ఆయన ఎమ్మెల్యే ఎంఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. హేమావతి పంచాయతీని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారని, దీంతో ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని సమస్యలను తెలపాలని ప్రజలు, అధికారులను కోరారు. అలాగే మడకశిర నియోజవకవర్గంలోని ఐదు మండలాల్లో చెక్ డ్యామ్‌లను మరమత్తు చేయించాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు, చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వంద శాతం వైకల్యం ఉన్న తమ కుమార్తె తిప్పేబాయికి రూ.6 వేల నుంచి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని బసవనపల్లి పంచాయతీ ఆరోనపల్లి తండాకు చెందిన మహిళ కలెక్టరుకు అర్జీ ద్వారా విన్నవించింది. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఎంపీడీఓ రామరావు, సర్పంచ్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.... మడకశిర రూరల్ మండలం మణూరు గ్రామ సమీపంలోని హంద్రీ–నీవా కాలువ, పంప్‌హౌస్‌ను, గుడిబండ మండలం హిరేతూర్పి వద్ద హంద్రీ–నీవా కాలువను ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ ఎస్‌ఈ స్వరూప్, హంద్రీ–నీవా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు.
వక్క మార్కెట్
ఏర్పాటుపై కదలిక
మడకశిర: వక్క మార్కెట్ ఏర్పాటుపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. విస్తారంగా వక్క తోటలు విస్తరించినా.. మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంపై ‘హామీ ‘వక్క’లైంది’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ స్పందించారు. ఆర్డీఓ ఆనందకుమార్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో కలిసి అమరాపురం మండలం హలుకూరు గ్రామపంచాయతీ కాచికుంట రోడ్డు సమీపంలో మార్కెట్ ఏర్పాటు చేయబోయే స్థలాన్ని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఉదుగూరులోని ఓ రైతు ఇంటి ఆవరణలో ఒలిచిన వక్కను కలెక్టర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఎల్‌ఎన్.మూర్తి, మడకశిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురుమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి వై.వెంకటేశులు, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు గణేష్, ఎంపీడీఓ రామారావు, తహసీల్దార్ లక్ష్మీనరసింహ, సర్వేయర్ పుట్టరాజ్, తదితరులు, పాల్గొన్నారు.
నాడు భర్త.. నేడు భార్య మృతి
నాడు భర్త.. నేడు భార్య మృతి


