వైఎస్సార్ సీపీ కార్యకర్తపై ‘తమ్ముళ్ల’ దాడి
● వాట్సాప్ స్టేటస్‌లో
జగన్ పాట పెట్టాడని దౌర్జన్యం
● అడ్డువచ్చిన భార్యనూ
అసభ్యపదజాలంతో దూషణ
● మనస్తాపంతో ఆత్మహత్యకు
యత్నించిన బాధితుడు
ధర్మవరం: వైఎస్సార్ సీపీ కార్యకర్త తన వాట్సాప్ స్టేటస్‌లో వైఎస్ జగన్ పాట పెట్టడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డువచ్చిన అతని భార్యనూ అందరి ముందు అసభ్యపదజాలంతో దూషించారు. అవమానంగా భావించిన బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ముదిగుబ్బలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద నివాసం ఉంటున్న బాబ్‌జాన్ వైఎస్సార్ సీపీ కార్యకర్త. టైల్స్ పరిచే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇటీవల బాబ్‌జాన్ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ పాటలను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంటున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు బాజ్‌జాన్‌ను పిలిపించి మరోసారి జగన్ పాట స్టేటస్ పెడితే ఊరుకునేది లేదంటూ ఇటీవల హెచ్చరించారు. ఆ తర్వాత కూడా బాబ్‌జాన్ వైఎస్ జగన్ చిత్రాలు, పాటలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి బాబ్‌జాన్ పీర్ల చావిడి వద్ద ఉండగా.. పూటుగా మద్యం సేవించి అక్కడికి వచ్చిన నలుగురు టీడీపీ కార్యకర్తలు అతనిపై గొడవకు దిగారు. తాము చెప్పినా వినకుండా మళ్లీ జగన్ పాటను వాట్సాప్ స్టేటస్ పెడతావా... అంటూ దాడి చేశారు. అక్కడికి వచ్చిన బాబ్‌జాన్ భార్యను అసభ్యపదజాలంతో దూషించారు. దీన్ని అవమానంగా భావించిన బాబ్‌జాన్ ఇంటికి వెళ్లి తలకు పూసుకునే వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కదిరి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం గమనార్హం.


