అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
పుట్టపర్తి టౌన్: వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. చిన్న నిప్పు రవ్వ పడినా మంటలు వ్యాపిస్తాయి. ఆకతాయి చేష్టలకు, ఏమరపాటుకు గడ్డి వాములు, అడవులు దగ్ధమతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు తగ్గించి ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపక శాఖ మాక్‌డ్రిల్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నారు. 14న అమరవీరులకు నివాళి, 15ప బహిరంగ ప్రదేశాలు, కూడళ్లు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తారు. 16న అపార్టుమెంట్లు, 17న విద్యాసంస్థలు, 18న గ్యాస్ గోడౌన్లు, ఆయిల్ ఫాంలు, 19న ఆస్పత్రుల్లో అవగాహన కల్పిస్తారు. 20న అన్ని వర్గాల ప్రజలకు ఫైర్ సేఫ్టీపై వర్క్‌షాప్ నిర్వహించి వారోత్సవాలు ముగిస్తారు.
అందుబాటులో ఫైర్ సేవలు..
జిల్లాలో పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, మడకశిర అగ్నిమాపక కార్యాలయాలు ఉన్నాయి. ఆరుగురు ఫైర్ అధికారులతో పాటు జిల్లాలో 100 మంది సిబ్బంది, 24 మంది హోంగార్డులు ఉన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన అడ్వాన్స్‌డ్ వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్, రెస్క్యూ ఫైర్ ఇంజిన్, ట్రూప్ క్వారియర్, ఫైర్ బుల్లెట్ బైక్, మిస్ట్ జీప్‌లు అందుబాటులో ఉన్నాయి. కాలం చెల్లిన ఇంజిన్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో ఒక అగ్నిమాపక అధికారి, ఇద్దరు సహాయక అధికారులు జిల్లా వ్యాప్తంగా వాహనాలను అగ్నిమాపక అధికారి కాని, సహాయక అధికారి గాని తనిఖీ చేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని ప్రమాదాలు ఎదుర్కొవడానికి సిధ్ధంగా ఉండాలని అధికారులకు సూచనలు సలహాలు ఇస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, టపాసులు వంటివి ఇవ్వకూడదు. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరిగెత్తకుండా దుప్పటి చుట్టుకోవాలి. వంట గదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్ వంటివి ఉంచకూడదు. మండుతున్న పొయ్యిపై వస్తువులను దూరం నుంచి అందుకోవాలని ప్రయత్నించకూడదు. మండుతున్న స్టవ్‌పై కిరోసిన్ పోయడం ప్రమాదకరం. చెడిపోయిన గ్యాస్ ట్యూబ్ స్థానంలో ఐఎస్‌ఐ మార్కుగల కొత్త ట్యూబ్ అమర్చాలి.
రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన మాక్‌డ్రిల్స్‌కు అగ్నిమాపక శాఖ సర్వం సిద్ధం
ప్రణాళికతోనే ప్రమాదాల నివారణ
ఎండలు మండుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి. ప్రణాళికతో అగ్నిప్రమాదాలు నివారించవచ్చు. సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతాం. – హేమంత్‌రెడ్డి, డీఎఫ్‌ఓ
అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం
అగ్ని ప్రమాదం.. అప్రమత్తతే ప్రధానం


