కారు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● కుక్కను తప్పించే క్రమంలో ఘటన
పరిగి: కారు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మడకశిర మండలం మణూరు గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహ(28) కారు బాడుగకు నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. గత శుక్రవారం బెంగళూరుకు బాడుగ వెళ్లాడు. అక్కడి నుంచి విజయ్‌కుమార్, బాలచంద్ర అనే ఇద్దరు మిత్రులతో కలిసి మడకశిరకు తిరుగుపయనమయ్యాడు. శనివారం వేకువజామున మూడు గంటలు దాటాక పరిగి వద్దకు చేరుకున్నారు. మడకశిర వైపు వెళ్తుండగా ఉన్నపళంగా కుక్క అడ్డుగా రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న నాగులకట్టను ఢీకొట్టి ఆ పక్కనే ఉన్న రేకుల షెడ్డులోకి దూసుకెళ్లింది. లక్ష్మీనరసింహతో పాటు ఇద్దరు మిత్రులు గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లక్ష్మీనారాయణ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. కాగా లక్ష్మీనరసింహకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సస్పెండైన ఆర్‌ఐపై కేసు
కదిరి అర్బన్: సోషల్ మీడియాలో మాటలు వక్రీకరించి పోస్టులు పెట్టి పోలీసులకు, ఇతరులకు మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినేలా చేస్తున్నాడని కానిస్టేబుల్ గోవర్దన్ ఫిర్యాదు మేరకు ఓడీసీలో సస్పెండైన ఆర్‌ఐ మున్వర్‌బాషాపై కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న మున్వర్‌బాషా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులతో మార్చి 24న పట్టణ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో తనపై కేసులు పెట్టినవారంతా దొంగలే అంటూ కానిస్టేబుల్ గోవర్దన్, సీఐ నారాయణరెడ్డిని ఉద్దేశించి మీరు ఇక్కడ ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం సోషల్ మీడియాలో వక్రీకరించిన మాటలతో పోస్ట్ పెట్టి పోలీసులు, ఇతరుల మధ్య శాంతియుత వాతావరణం దెబ్బతినేలా చేశారని పేర్కొన్నారు. వక్రీకరించిన వాయిస్‌ను వైరల్ చేస్తున్న వారందరికీ చట్ట ప్రకారం నోటీసులిచ్చి విచారణ చేస్తామని సీఐ తెలిపారు.
వృద్ధునిపై పోక్సో కేసు
ముదిగుబ్బ: మండల కేంద్రం ముదిగుబ్బలో ఓ వృద్ధునిపై పోక్సో కేసు నమోదైంది. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను వృద్ధుడు దగ్గరకు తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వృద్ధునిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వృద్ధునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ శివరాముడు తెలిపారు.


