పంగుణి ఉత్సవం..ఆధ్యాత్మిక సౌరభం
హిందూపురం: దశాబ్దాల క్రితం వచ్చి హిందూపురంలో స్థిరపడిన తమిళ, కేరళీయులు శుక్రవారం నిర్వహించిన పంగుణి ఉత్సవంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. తమ ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణేశ్వర స్వామి రథయాత్రను కేరళ, తమిళీయులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఉత్తర ఫాల్గుణి నక్షత్రాన్ని పురస్కరించుకుని పళనీ క్షేత్రంలో సుబ్రహ్మణేశ్వరుడికి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తారు. అదేరోజు స్థానికంగా స్థిరపడిన తమిళ, కేరళీయులు కూడా పంగుణి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం బెంగళూరు రోడ్డులోని పళనీనగర్, ఇందిరానగర్‌లో స్థిరపడిన వారంతా పంగుణి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్ సుబ్రహ్మణేశ్వరస్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం 14 రోజులుగా సుబ్రహ్మణ్యస్వామి మాలధరించిన వారంతా దవడల్లో శూలాలు గుచ్చుకుని, శరీరానికి కొక్కేలు తగిలించుకుని పుర వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. మరికొందరు శరీరానికి గుచ్చుకున్న కొక్కేలతో విలక్కులు, ఆటోలను లాగారు. పళనీనగర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరి బెంగళూరు రోడ్డు, చిన్నమార్కెట్, గాంధీ సర్కిల్, మెయిన్‌రోడ్డు గుండా పొట్టిశ్రీరాములు సర్కిల్, ఆర్‌పీజీటీ రోడ్డు, అంబేడ్కర్ సర్కిల్, మెయిన్ బజార్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వస్తున్న భక్తులు, ప్రజలకు దాతలు చల్లని నీరు, మజ్జిగ, పానీయాలు అందించారు. టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ నాయకుల పూజలు..
సుబ్రమణేశ్వర షష్టి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి పార్టీ నేతలతో కలిసి బెంగళూరురోడ్డులోని సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. మాలాధారణ పూజల్లో పాల్గొన్నారు. వేణురెడ్డి వెంట పార్టీ నాయకులు మనోజ్, శివ, మురుగన్, భాస్కర్, నవీన్, హరి ఉన్నారు.


