జోరుగా కోడి పందేలు
కనగానపల్లి: సంక్రాంతి పండుగ వేళ కోడి పందేలు నిర్వహిస్తూ తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి సర్కిల్ పరిధిలోని కనగానపల్లి, రామగిరి మండలాల్లో కోడి పందాలు, పేకాట జోరుగా సాగుతున్నాయి. పాతపాళ్యం, మాదాపురం గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో పందెం రాయుళ్లు పలుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఆటలు కొనసాగిస్తున్నారు.
నిర్వాహకులకు రూ.లక్షల్లో సొమ్ము
కనగానపల్లి, రామగిరి మండలాల్లో ఏర్పాటు చేసిన కోడి పందేలు, పేకాట శిబిరాల నిర్వాహకులు రూ. లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కోడి పందాల్లో పాల్గొనే వారు కోళ్లను పందెంలోకి దింపాలంటే ఒక్కొక్కరితో రూ.10 వేల వరకు వరకు నిర్వాహకులకు చెల్లించాలి. తర్వాతా గెలిచిన వారు వచ్చిన డబ్బులో 10 శాతం కమీషన్ ఇవ్వాలని చెబుతున్నారు. దీనికి తోడు ఈ శిబిరాల వద్దనే ఏర్పాటు చేసిన మద్యం బెల్టు షాపుల నుంచి కూడా వీరు లాభం పొందుతున్నారని తెలిసింది. కనగానపల్లి మండలంలోని పాతపాళ్యం స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన శిబిరంలో బుధవారం జోరుగా పందేలు నిర్వహించారు. పోటీలకు అడ్డు తగలకుండా పోలీసులకు కూడా భారీ మొత్తంలో ముడుపులు అప్పజెప్పారంటున్నారు. దీనిపై రామగిరి సీఐ శ్రీధర్‌తో వివరణ కోరగా కోడి పందేల నిర్వాహణకు ఎక్కడా అనుమతులు ఇవ్వలేదన్నారు.


